ఓ ఆత్మీయుడ్ని కోల్పోయా – మెగాస్టార్ చిరంజీవి

Published on Nov 29, 2021 10:47 am IST

ప్రముఖ కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్ శివ శంకర్ మాస్టర్ కి కరోనా సోకడంతో గత కొన్ని రోజులుగా ఆయన హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో సినీ లోకంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శివ శంకర్ మాస్టర్ మరణం పై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో మెసేజ్ లు పోస్ట్ చేశారు.

శివశంకర్‌ మాస్టర్‌ మరణ వార్త నన్ను కలచివేసింది. ఆయనా నేనూ కలిసి చాలా సినిమాలకు పనిచేశాం. ‘ఖైదీ’ చిత్రంతో మా స్నేహం మొదలైంది. ఇటీవల ‘ఆచార్య’ సెట్‌లో కలుసుకున్నాం. అదే చివరిసారి అవుతుందని అస్సలు ఊహించలేదు. ఓ ఆత్మీయుడ్ని కోల్పోయా. ఆయన మృతి నృత్య కళకే కాదు యావత్‌ సినీ పరిశ్రమకే తీరనిలోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. – నటుడు చిరంజీవి

శివశంకర్‌ మృతితో సినీ పరిశ్రమ ముద్దుబిడ్డను కోల్పోయింది. నృత్యం, నటనతో లక్షలమంది అభిమానాన్ని ఆయన సంపాదించారు.-చంద్రబాబు

కొవిడ్‌కు చికిత్స పొందిన శివశంకర్‌ మాస్టర్‌ కోలుకుంటారని భావించా. ఆయన కన్నుమూయడం బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. శాస్త్రీయ నృత్యంలో పట్టున్న ఆయన సినీ నృత్యంలో ఆ పరిజ్ఞానాన్ని మేళవించారు. ప్రేక్షకుల్ని మెప్పించారు. ‘మగధీర’లోని ఓ పాటకు జాతీయస్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. శివశంకర్‌ మాస్టర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా. – నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌.

శివశంకర్‌ మాస్టర్‌ లేరన్న విషయం బాధ కలిగించింది. ఆయన కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. – శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ

సంబంధిత సమాచారం :