ఆదిత్య మ్యూజిక్ ద్వారా ‘ధృవ’ ఆడియో!

20th, August 2016 - 06:01:49 PM

dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’ సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలోని హాట్ టాపిక్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ ఫస్ట్‌లుక్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో ఖుషీ అయిన టీమ్, ఆడియో రిలీజ్ కోసం ఇప్పట్నుంచే ఏర్పాట్లు రెడీ చేసుకుంటోంది. తెలుగులో ప్రముఖ మ్యూజిక్ కంపనీల్లో ఒకటైన ఆదిత్య మ్యూజిక్, ‘ధృవ’ సినిమా ఆడియో హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.

ఇక ఇదే విషయాన్ని తెలియజేస్తూ, ఆదిత్య మ్యూజిక్, త్వరలోనే ఆడియో వేడుక జరగనుందని, ఇందుకు సంబంధించిన వివరాలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. హిపాప్ తమిజా సంగీత దర్శకత్వంలో ధృవ ఆడియో రూపొందింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్, తమిళంలో ఘన విజయం సాధించిన తని ఒరువన్‌కు రీమేక్. గీతా ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.