‘హలో’ సినిమాకి బలం నాన్నే అంటున్న అఖిల్ !

10th, December 2017 - 10:00:17 AM

అక్కినేని అఖిల్ పకడ్బంధీ వ్యూహంతో ఈసారి ‘హలో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. టీజర్ తోనే హిట్ లక్షణాలన్నీ ఉట్టిపడుతున్న ఈ సినిమా వెనుక అఖిల్ తండ్రి, చిత్ర నిర్మాత నాగార్జునగారి కృషి ఎంతో ఉంది. ఆరంగేట్రం సినిమానే పరాజయం పొందటంతో అఖిల్ యొక్క రెండవ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టిన నాగ్ తనకు ఇష్టమైన, నమ్మకమైన దర్శకుడు విక్రమ్ కుమార్ ను రంగంలోకి దించాడు.

విక్రమ్ కుమార్ కూడా నాగార్జున ఆంచనాలకి తగ్గట్టే వైవిధ్యమైన కథను సిద్ధం చేసి, నాగార్జున పర్యవేక్షణలోనే అక్కినేని హీరోలను సంతృప్తిపరచే సినిమాను తీసి రిలీజుకు సిద్ధం చేశారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి వెనకున్న ప్రధాన బలం నాన్నే అంటున్న అఖిల్ ఈ సినిమాతో చాలానే నేర్చుకున్నానని, విజయంపై ధీమాగా ఉన్నామని చెబుతున్నారు. ఈ నెల 22న విడుదలకానున్న ఈ చిత్ర ఆడియో ఈరోజు సాయంత్రం వైజాగ్లో ఘనంగా జరగనుంది.