రెండో పరీక్షకు సిద్దమంటున్న అఖిల్ !

అక్కినేని యువ హీరో అఖిల్ చేస్తున్న రెండవ చిత్రం ‘హలో’. అక్కినేని కుటుంబానికి ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం ‘మనం’ ను అందించిన దర్శకుడు విక్రమ్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతో సినిమాపై మంచి పాజిటివ్ క్రేజ్ నెలకొంది. కొన్ని నెలల క్రితం మొదలైన ఈ చిత్ర షూట్ ఎక్కడా ఒడిదుడుకులు లేకుండా సాగిపోతోంది. అఖిల్ కూడా సినిమా కోసం అన్ని విధాలా కష్టపడుతున్నారు. మొదటి చిత్రం ‘అఖిల్’ ఊహించని రీతిలో ప్లాప్ అవ్వడంతో ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నారాయన.

ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆయనకు రెండో పరీక్షని అనొచ్చు. ఈ సినిమాను మొదలుపెట్టేటప్పుడు అఖిల్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఇప్పుడు చివరి షెడ్యూల్లో కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారు. సినిమా కోసం చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని, ముందు చెప్పినట్టే డిసెంబర్ 22న ‘హలో’ విడుదలవుతుందని అన్నారు. నాగార్జున స్వయంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్మిస్తున్న ఈ చిత్రం అఖిల్ కు ఖచ్చితమైన సక్సెస్ ఇస్తుందని, పైగా నాగార్జునకి బాగా కలిసొచ్చిన డిసెంబర్ నెల అఖిల్ కూడా వర్కవుట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.