ఎట్టకేలకు అఖిల్ రెండవ సినిమా మొదలైంది !


2015 లో విడుదలైన ‘అఖిల్’ చిత్రంతో హీరోగా వెండి తెరకు పరిచయమయ్యాడు అక్కినేని అఖిల్. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోవడంతో కాస్త నిరుత్సాహానికి గురైన అఖిల్ ఈసారి లాంగ్ గ్యాప్ తీసుకుని పక్కా ప్లాన్ తో రెండవ సినిమాని నిన్ననే మొదలుపెట్టాడు. దీంతో అఖిల్ రెండవ చిత్రం కోసం ఎంతో ఆతురతగా ఎదురు చూసిన అక్కినేని ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం మొదలైంది. నాగార్జున కూడా ఈ చిత్రం గురించి ట్విట్టర్లో ప్రస్తావిస్తూ ‘సహనం ఎప్పుడూ లాభదాయకమే’ అన్నారు.

అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ వంటి మంచి క్లాసికల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై మంచి క్రేజ్ నెలకొంది. అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ ఈరోజు నుండే మొదలుకానుంది. ‘ఎక్కడ ఎక్కడ ఉందో తారక’ వంటి క్లాసీ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం ఇంకా ఫైనల్ కాలేదు. ఇకపోతే ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం, పివి వినోద్ సినిమాటోగ్రఫీ భాద్యతలు నిర్వహించనున్నారు.