తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు (ఏప్రిల్ 23)న జరిగింది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. ఇక ఈ రసవత్తర ఎన్నికల వేళ ఓ హీరోయిన్ తన ఓటు వేసేందుకు వెళ్లింది. అయితే, ఆమె ఎన్నికల అధికారులు చెప్పిన మాటలు విని షాక్‌కు గురైంది.
నటి అక్షయ హరిహరన్ తన ఓటు వేసేందుకు అడయార్‌లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లింది. అయితే, ఆమె ఓటు అప్పటికే ఎవరో వేసేశారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది సదరు హీరోయిన్. ఓటర్ స్లిప్ అందకపోవడంతో ఆన్లైన్ వివరాల ఆధారంగా బూత్‌కు వెళ్లగా, తన పేరు మీద మరొకరి వేలిముద్ర ఉండటం చూసి ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై స్పందించిన అక్షయ, అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఒక వీడియో విడుదల చేసింది. తన ఐడీ కార్డులన్నీ సరిగ్గా ఉన్నాయని, ఫోటో వేరుగా ఉన్న వ్యక్తిని ఓటు వేయడానికి ఎలా అనుమతించారని ఆమె నిలదీసింది. ఈ ఘటనపై ఆమె ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. ఏదేమైనా సెలబ్రిటీల ఓట్లు కూడా ఇలా వేరొకరు వేయడంతో సామాన్య ప్రజలు సైతం అవాక్కయ్యారు.
