
మణిరత్నం, ఏ.ఆర్.రెహమాన్, పీసీ శ్రీరామ్ ఈ ముగ్గురి కలయికలో వచ్చిన సినిమాలు ఎంతటి అద్భుతాలను సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముగ్గురి కలయికలో తాజాగా తెరకెక్కిన సినిమాయే ‘ఓకే కన్మణి (ఓకే బంగారం)’. విభిన్న, విలక్షణ, భావోద్వేగపూరిత సినిమాల ద్వారా దేశంలోని గొప్ప దర్శకుల్లో ఒకరుగా నిలిచిన మణిరత్నం.. గత కొంతకాలంగా తనదైన ముద్ర వేసే సినిమా చేయలేకపోయారు. ఇప్పుడు తాజాగా ‘మణిరత్నం ఈజ్ బ్యాక్’ అన్న స్లోగన్ ‘ఓకే బంగారం’ సినిమా విషయంలో వినబడుతోంది. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేయనున్న విషయం తెలిసిందే!
ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్ టీజర్స్ వంటివి సినిమాపై ఆసక్తిని పెంచగా, రెహమాన్ అందించిన ఆల్బమ్ సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ ఆల్బమ్ విడుదలైన తర్వాత సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగాయ్! అన్ని చోట్లా ఈ సినిమా విషయంలో పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఈ సినిమాకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దిల్‌రాజు తెలుగులో భారీ ఎత్తున విడుదల చేపట్టారు. ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ఒక డబ్బింగ్ సినిమాకు ఇంతకుముందెన్నడూ చేపట్టనంత భారీగా చేపట్టారు. ఇక నిన్న మణిరత్నం, రెహమాన్, నిత్యామీనన్ హాజరవ్వగా హైద్రాబాద్‌లో చేపట్టిన ప్రమోషన్ కార్యక్రమాలు సినిమాకు బాగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ అందమైన ప్రేమకథ రేపు (ఏప్రిల్ 17న) ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాకున్న క్రేజ్, ఇప్పటికే పెరిగిపోయిన అంచనాలు, మణిరత్నం ఈజ్ బ్యాక్ అన్న స్లోగన్ ఇవన్నీ సినిమాకు విపరీతంగా కలిసివచ్చే అంశాలుగా చెప్పొచ్చు. ఇన్ని అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమాకు ప్రేక్షకుడి నుండి మంచి టాక్ గనుక వస్తే.. ‘ఓకే బంగారం’ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సొంత చేసుకుంటుందనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.