మహేష్ సినిమా సెట్స్‌పైకి వెళ్ళేందుకు అంతా సిద్ధం!

Mahesh-Babu
సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకొని సెట్స్‌పైకి వెళ్ళేందుకు పక్కాగా సిద్ధమైన విషయం తెలిసిందే. సౌతిండియన్ లెవెల్లో తిరుగులేని పాపులారిటీ ఉన్న హీరో, దర్శకుడు కలిసి చేస్తోన్న సినిమా కావడంతో సెట్స్‌పైకి వెళ్ళకముందునుంచే ఈ సినిమా మంచి ఆసక్తి రేకెత్తిస్తోంది. హైద్రాబాద్‌లో రేపు ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలుకానుంది. ఇక ‘బ్రహ్మోత్సవం’ లాంటి పరాజయం తర్వాత మహేష్ నటిస్తోన్న ఈ సినిమా ఎలాగైనా పెద్ద విజయం సాధించాలని ఆయన అభిమానులంతా కోరుకుంటూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రేపు సినిమా సెట్స్‌పైకి వెళుతోన్న సందర్భంగా టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతూ మహేష్ అభిమానులంతా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. #AllTheBestToMahesh23, #Mahesh23 ట్యాగ్‌లతో ట్విట్టర్‌లో మహేష్ అభిమానులు తమ హీరోకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హైద్రాబాద్, చెన్నై, ముంబై, పూణే, గుజరాత్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, సంగీత దర్శకుడు హరీస్ జైరాజ్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఎన్.వి.ప్రసాద్ – ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.