నేను ట్రాక్ మార్చి చేసిన సినిమా ‘మేడ మీద అబ్బాయి’ – అల్లరి నరేష్


అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ‘మేడ మీద అబ్బాయి’. ఇన్నాళ్లు ఒకే ధోరణిలో సినిమాలు చేస్తూ వరుస పరాజయాల్ని అందుకున్న నరేష్ ఈ సినిమాతో అయినా పంథా మారిస్తే బాగుంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. నరేష్ కూడా ఈ సినిమాలో కొత్త నరేష్ ని చూస్తారని బల్లగుద్ది చెప్తున్నారు. నిన్న సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో నరేష్ మాట్లాడుతూ ‘ఇన్నాళ్లు ఒకే తరహా కామెడీ చేస్తూ వచ్చాను. నా అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ పెద్దలు ట్రాక్ మార్చమని చెప్పారు. అలాగే చేశాను’ అన్నారు.

ఈ సినిమాతో ఇకపై తన దగ్గరకు కొత్త తరహా కథలు వస్తాయని ఆశిస్తున్నానని, ఇన్నాళ్లు నన్ను ఒక ఫ్రేమ్ లో పెట్టి కథలు రాసిన రచయితలు ఇకపై భిన్నమైన కథలు తీసుకొస్తారని అనుకుంటున్నానని అన్నారు. జి. ప్రజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు డీజే. వసంత్ సంగీతం అందిస్తుండగా ఇందులో నరేష్ సరసన నిఖిల విమల అనే కొత్త హీరోయిన్ నటించింది. బోపన్న చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమాను సెప్టెంబర్ 8న రిలీజ్ చేయనున్నారు.