ఇంటర్వ్యూ : అల్లరి నరేష్ – ఈసారి కామెడీతో పాటు కథ కూడా ఉండే సినిమా చేశాను !

ఇంటర్వ్యూ : అల్లరి నరేష్ – ఈసారి కామెడీతో పాటు కథ కూడా ఉండే సినిమా చేశాను !

Published on Sep 7, 2017 5:45 PM IST


గత కొన్నాళ్లుగా సరైన విజయం లేక ఇబ్బందిపడుతున్న హీరో అల్లరి నరేష్ చేసిన తాజా ప్రయత్నం ‘మేడ మీద అబ్బాయి’. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ కు తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం రేపే విడుదలకానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) ఈసారి సినిమాలో కొత్తదనం చూపించబోతున్నారా ?
జ) ఇంతకు ముందు నా సినిమాల్లో కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. కానీ ఇందులో అలా కాదు. సరిపడా కామెడీతో పాటు మంచి ఎమోషనల్ కథ కూడా ఉంటుంది. సాధారణంగా కామెడీ థ్రిల్లర్స్ తక్కువగా వస్తుంటాయి. ఇది అలాంటి సినిమానే. ఇందులో చిన్నపాటి మెసేజ్ కూడా ఉంటుంది.

ప్ర) మరి మీ పాత్ర సంగతేమిటి ?
జ) ఇప్పటి వరకు నా పాత్రల్లో కామెడీ ఎక్కువగా ఉండేది. కొన్ని సినిమాల్లో స్పూఫులు కూడా చేశాను. కానీ ఈసారి అలా కాదు. కొంచెం కామెడీ మాత్రమే ఉంటుంది. మిగతా అంతా ఇన్నోసెన్స్ కనిపిస్తుంది. అంటే అందరి మాటలు నమ్ముతూ, కలల్లోనే బ్రతికే కుర్రాడిలా ఉంటాను.

ప్ర) ఇందులో డైరెక్టర్ అవ్వడమనేదే మీ లక్ష్యమా ?
జ) ఇందులో నేనొక ఇంజనీరింగ్ అబ్బాయిని. 24 పేపర్స్ మిగిలిపోయి ఉంటాయి. దాంతో చదువు పక్కనబెట్టి సినిమాలంటే ఇష్టంతో డైరెక్టర్ అయిపోదామని హైదరాబాద్ వస్తాడు. కానీ కాలేడు. ఇందులో డైరెక్టర్ అవడమనేది చిన్న అంశం మాత్రమే. అసలు కథ వేరే ఉంది.

ప్ర) మీకు ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది ?
జ) ‘గమ్యం’ సినిమాలో గాలి శీను. ‘శంభో శివ శంభో, నేను’ తరహాలో ఇంటెన్సిటీ ఉన్న పాత్రలు చేయాలనుంది. అంటే నటుడిగా పూర్తి సంతృప్తినిచ్చే క్యారెక్ట్స్ చేయాలని కోరుకుంటాను.

ప్ర) ఒరిజినల్ వెర్షన్ దర్శకుడిని తెలుగుకి కూడా తీసుకోవడానికి కారణం ?
జ) ఒక హిట్ సినిమానై రీమేక్ చేసేటప్పుడు గొప్పగా చేయకపోయినా పర్లేదు కానీ చెడగొట్టకూడదనే సామెత ఉంది. అందుకే ఒరిజినల్ వెర్షన్ కు పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన్నే ఎంచుకున్నాం. ఆయన కూడా ఒరిజినల్ వెర్షన్ కు పెట్టిన ఎఫర్ట్ కన్నా ఎక్కువ ఎఫర్ట్ తెలుగు రీమేక్ కు పెట్టి పనిచేశారు.

ప్ర) అసలు ఈ సినిమా చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది ?
జ) మలయాళ వెర్షన్ ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ హైదరాబాద్లో రిలీజైనప్పుడు కొంతమంది స్నేహితులు సినిమా బాగుంది చూడు అన్నారు. నేను కూడా సాధారణ ప్రేక్షకుడిలాగే సినిమా చూశా. చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత నిర్మాత బోపన్న చంద్రశేఖర్ కూడా సినిమా రీమేక్ రైట్స్ ఉన్నాయి, ఒకసారి సినిమా చూడమని అడిగారు. అలా రెండవసారి కూడా చూసి ఒప్పుకున్నాను.

ప్ర) తెలుగు నేటివిటీ కోసం ఏవైనా మార్పులు చేశారా ?
జ) 90 శాతం ఒరిజినల్ వెర్షన్ లానే ఉంటుంది. కానీ అక్కడ హీరో పాత్ర లవర్ బాయ్ లా కనిపిస్తుంది. నాకేమో కామెడీ కింగ్ అనే ఇమేజ్ ఉంది. అందుకే చిన్న చిన్న మార్పులు చేసి నా పాత్రకు కొంచెం కామెడీ టచ్ ఇచ్చాం.

ప్ర) మీ సహ నటుల గురించి చెప్పండి ?
జ) ఇందులో నిఖిల విమల హీరోయిన్, హైపర్ ఆది నా ఫ్రెండ్ గా చేశాడు. అవసరాల శ్రీనివాస్ ఇంకో ముఖ్యమైన క్యారెక్టర్. మేం నలుగురం సినిమాకు నాలుగు స్థంభాల్లాంటి వాళ్ళం. సెకండాఫ్లో మేం నలుగురం కలిసి చేసే రోడ్ జర్నీ సినిమాకు మేజర్ హైలెట్.

ప్ర) ఇంతకు ముందు సినిమాలు ఎందుకు విఫలమయయ్యాని అనుకుంటున్నారు ?
జ) అందరూ నువ్వు కామెడీ బాగా చేస్తావు అనడంతో నేను కూడా దానికే స్టిక్ అయిపోయి సినిమాలు చేశాను. సన్నివేశాల్లో అప్పటికప్పుడు నవ్వించగలిగినా చివరికి ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు నిరుత్సాహపడ్డారు. ఆ తప్పుల్ని తెలుసుకున్నాను. అందుకే ఈసారి కామెడీతో పాటు కథ కూడా ఉండేలా చూసుకున్నాను.

ప్ర) రిలీజ్ గురించి ఏమైనా టెంక్షన్ గా ఉందా ?
జ) ఇప్పటికి 53 సినిమాలు చేశాను. అంటే 53 శుక్రవారాలు, 53 రిలీజులు. మొదట్లో భయం ఉండేది. కానీ ఇప్పుడు అలవాటైపోయింది. అంతగా కంగారేంలేదు.

ప్ర) మీ తర్వాతి సినిమాలేంటి ?
జ) రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. స్క్రిప్ట్స్ కూడా రెడీ అయిపోయాయి. అక్టోబర్ నుండి ఒక సినిమా మొదలవుతుంది. పూర్తి వివరాలు త్వరలోనే చెప్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు