2017 కి సూపర్ ప్లాన్ రెడీ చేసుకున్న హీరో !

allari-naresh

కామెడీ ప్రధాన బలంగా హీరోగా ఎదిగిన నటుడు అల్లరి నరేష్. ఒకప్పుడు ఆయన సినిమాలంటే నవ్వులకు మినిమమ్ గ్యారెంటీ ఉండేది. కానీ ఈ 2016లో ఆయన విషయంలో ఆ పరిస్థితి కనబడలేదు. విడుదలైన ఒక సినిమా ‘సెల్ఫీ రాజా’ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీంతో అల్లరి నరేష్ 2016 ముగింపుకు, 2017 మొత్తానికి కలిపి సూపర్ ప్లానింగ్ రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జి. నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్లో నటించిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ సినిమాతో డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఆయన 2017 కోసం ఇప్పటికే రెండు కొత్త సినిమాలకి సైన్ చేసినట్టు స్వయంగా తెలిపారు.

వాటిలో నూతన దర్సకుడు అనీష్ డైరెక్ట్ చేస్తున్న మలయాళ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓరు వడక్కన్ సెల్ఫీ’ రీమేక్ ఒకటి. ఇప్పటికే మొదలవ్వాల్సిన ఈ ప్రాజెక్ట్ కరెన్సీ బ్యాన్ కారణంగా ఆగిపోగా తిరిగి 2017 ఫిబ్రవరి నుండి మొదలవుతుందట. ఇక మరొక చిత్రం భీమినేని శ్రీనివాస రావు డైరెక్షన్లో ఉంటుందట. ఇలా 2017 మొత్తం తాను మంచి ప్రాజెక్టులతో బిజీగా ఉంటానని అన్నారు. అవి తప్పక సక్సెస్ అవుతాయని, ఈ నెల 30న విడుదలవుతున్న ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ కూడా మంచి విజయం సాదిస్తుందని అన్నారు. ఇకపోతే నరేష్ త్వరలో మెగా ఫోన్ పట్టుకుని డైరెక్షన్ కూడా చేస్తారని బలమైన వార్తలు వినిపిస్తున్నాయి.