‘మేడ మీద అబ్బాయి’ కథ మొదలైంది !


‘సెల్ఫీ రాజా, ఇంట్లో దెయ్యం నాకేం భయం’ వంటి చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో నిరుత్సాహపడ్డ హీరో అల్లరి నరేష్ ఈసారి ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని ఉద్దేశ్యంతో మొదలుపెట్టిన చిత్రమే ‘మేడ మీద అబ్బాయి’. ఈ చిత్రం నిన్న లాంఛనంగా ప్రారంభమైంది. జాహ్నవి ఫిలిమ్స్ పతాకంపై బొప్పన్నచంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సూపర్ హిట్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’కి రీమేక్ గా రూపొందుతోంది.

ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన జి. ప్రజీత్ ఈ రీమేక్ కు కూడా దర్శకత్వం వహించడం విశేషం. ఇకపోతే ఈ చిత్రంలో నిఖిలా విమల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ 16వ తేదీ నుండి పొలాచ్చిలో మొదలుకానుంది. తన కామెడీ శైలికి భిన్నంగా మొదటిసారి పూర్తి స్థాయి థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నానని, ఈ చిత్రం తప్పక ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని అల్లరి నరేష్ అన్నారు. డీజే. వసంత్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, సత్యం రాజేష్ వంటి ఇతర ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.