‘తండేల్’ పైరసీ పై నిర్మాతల వార్నింగ్

‘తండేల్’ పైరసీ పై నిర్మాతల వార్నింగ్

Published on Feb 10, 2025 11:00 PM IST

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతుండటంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సినిమా పైరసీ బారిన పడటంతో తాజాగా చిత్ర నిర్మాతలు బన్నీ వాసు, అల్లు అరవింద్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘తండేల్ సినిమా సూపర్ హిట్ కావడంతో మా టీమ్ అంతా కలిసి ఆంధ్రాలో సక్సెస్ టూర్ చేస్తున్నారు. ప్రజల నుంచి చాలా అద్భుతమైన స్పందన వస్తుంది. నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఓటీటీ చర్యల వల్ల కొన్ని సంవత్సరాలుగా సినిమా పైరసీ ఆగింది. అయితే రెండు నెలల నుంచి మళ్లీ పైరసీ రాక్షసి పడగ విప్పి నాట్యం ఆడుతోంది. మొన్న దిల్ రాజు గారి సినిమాని ఇలాగే ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. చాలా ప్రయత్నాలు చేసి, లింక్‌లు తొలగించాం. పైరసీపై పోరాటం చేసేందుకు ఫిల్మ్‌ ఛాంబర్‌లో సెల్ ఏర్పాటు చేశాం. వాళ్లు పగలూ రాత్రి పైరసీ నియంత్రణకు పనిచేస్తూ ఉంటారు. సమస్య ఏంటంటే, చాలా మంచి ప్రింట్‌ ఎక్కువగా వచ్చేస్తోంది. వాట్సాప్ గ్రూపుల్లో లింకులను ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇలా చేస్తున్న వాట్సప్, టెలిగ్రామ్ గ్రూప్‌ల అడ్మిన్‌లను గుర్తించాం. వారందనినీ అరెస్ట్‌ చేయిస్తాం. వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూప్‌ అడ్మిన్‌లకు ఇదే నా హెచ్చరిక. అడ్మిన్లు జాగ్రత్తగా ఉండండి. మీరు జైలు వెళ్లే అవకాశం ఉంది. నిన్న ఆర్టీసీ బస్సుల్లో సినిమా పైరసీ ప్రింట్‌ ప్రదర్శించడం డ్రైవర్ అమాయకత్వం. సినిమా సక్సెస్‌ను ఆస్వాదించే సమయంలో ఇదొక ప్రతిబంధకం అయింది. దయచేసి అందరూ సహకరించాలని కోరుతున్నాను’ అని అన్నారు.

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ..‘గత రెండేళ్ల నుంచి పైరసీ కంట్రోల్ లోకి వచ్చింది. ‘గీత గోవిందం’ తర్వాత చాలా ఫైట్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం వల్ల చాలా వరకు తగ్గింది. ఓటీటీల రాకతో పైరసీ తగ్గుతూ వచ్చింది. అన్ని భాషలతో పోలిస్తే, తెలుగులో పైరసీని చాలా వరకు కంట్రోల్ చేయగలిగాం. తెలుగులో ఎప్పుడూ లేని కల్చర్‌ గత రెండు నెలల కనపడుతోంది. ఈ సినిమా మా అందరి కష్టం. సినిమా బ్లాక్ బస్టర్ సాధించి మేము ఎంజాయ్ చేసే సమయంలో ఇలా జరిగింది. సోమవారం నుంచి టికెట్‌ రేట్లు తగ్గించాలని అల్లు అరవింద్‌ సూచించారు. అందుకు తగినట్లుగానే చాలా థియేటర్స్‌లో టికెట్‌ ధరలు తగ్గించాం. కొంతమంది తెలిసి, మరికొంత మందికి తెలియక ఇలాంటి పనులు చేస్తున్నారు. క్రిమినల్‌ కేసు ఫైల్‌ అయితే, వెనక్కి తీసుకోలేము. యువత ఇందులో ఇరుక్కొవద్దు. ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడం మమ్మల్ని మరింత బాధించింది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాం. ఈ విషయంలో నిర్మాతలకు మన ప్రభుత్వం చాలా బాగా సపోర్ట్‌ చేస్తోంది. పైరసీ చేసిన వాళ్లకి, దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్న వాళ్లకీ కేసులు వర్తిస్తాయి. ‘తండేల్’ పైరసీ చేస్తే 9573225069 నెంబర్ కు మెసేజ్ చేయండి. అభిమానులు చేయాల్సింది ఇదొక్కటే. పైరసీ జరిగితే ఈ నెంబర్ కి మెసేజ్ పెట్టండి’ అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు