రామ్ చరణే మెగాస్టార్ అన్న అల్లు అర్జున్!

allu-arjun-ram-charan
మెగా ఫ్యామిలీ హీరోలంతా పాల్గొనగా, హైద్రాబాద్‌లో నిన్న సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున హాజరైన మెగా అభిమానుల సమక్షంలో రామ్ చరణ్, చిరంజీవి పుట్టినరోజు వేడుకలను భారీ ఆర్భాటాలతో నిర్వహించారు. ఇక ఈ వేడుకలో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ రామ్ చరణ్‌ను మెగాస్టార్‌గా సంభోదించారు. రామ్ చరణ్ ప్రసంగిస్తూ ఉన్న సందర్భంలో అభిమానులంతా మెగాస్టార్ మెగాస్టార్ అని అరుస్తూ వచ్చారు.

అదే సమయంలో స్టేజీపైకి వచ్చిన అల్లు అర్జున్, “వి వాంట్ మెగాస్టార్ అని ఎందుకు అరుస్తున్నారూ? ఇక్కడ ఉన్నదే మెగాస్టార్” అని చరణ్‌ను చూపిస్తూ అన్నారు. ఇక దీనిపై వెంటనే స్పందిస్తూ.. “థ్యాంక్యూ బన్నీ.. అయితే అంత సీన్ లేదు మనకి!” అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. మెగా వేడుకలో జరిగిన ఈ సరదా సంభాషణ అభిమానులను బాగా ఆకర్షించింది. ముఖ్యంగా రామ్ చరణ్ స్టైల్‌గా ఇచ్చిన సమాధానం చిరుపై ఆయనకున్న గౌరవాన్ని చూపేలా ఉండడం అభిమానుల్ని కట్టిపడేసింది.