ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీకి ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. అయితే, ఈ సినిమా రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయగా నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని కోర్టు గతంలో ఆదేశించింది. అయితే, అల్లు అర్జున్ భద్రతా కారణాల దృష్ట్యా మినహాయింపు కోరడంతో ఈ నిబంధనను కోర్టు తాజాగా మినహాయించింది.
అంతేగాక అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో అల్లు అర్జున్‌కు ఈ కేసులో మరికొంత ఊరట లభించినట్లు అయ్యింది.