డీజే లో డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్న అల్లు అర్జున్ !

12th, November 2016 - 09:20:21 AM

dj-allu-arjun

స్టార్ హీరోల్లో వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న హీరో అల్లు అర్జున్. ‘రేసు గుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు’ వంటి చిత్రాలతో బన్నీ మార్కెట్, ఇమేజ్ అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ స్టైలిష్ స్టార్ చేస్తున్న తాజా చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. హరీష్ శంకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు తన ప్రతి సినిమాలో సరికొత్త స్టైల్ తో ఆకట్టుకునే బన్నీ ఈ సినిమాలో కూడా మరో ఫ్రెష్ స్టైలిష్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తోంది.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడి గెటప్ లో పంచె కట్టులో సాంప్రదాయబద్దంగా కనిపిస్తాడట. అందుకోసం బన్నీ ఇప్పటికే ఆ స్టైల్ ను వంటపట్టించుకోవడానికి ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడట. ఈ గెటప్ తో పాటు మాస్ లుక్ తో మరో గెటప్ లో కూడా బన్నీ అలరిస్తాడని తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే హరీష్ శంకర్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎంటర్టైన్మెంట్ కి ఏమాత్రం కొదవుండదని తెలుస్తోంది. ఇకపోతే ఈ మధ్యే షూటింగ్ మొదలైన ఈ చిత్రంలో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇకపోతే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ సంగీతం అందిస్తుండగా, ఆయాంకా బోస్ సినిమాటోగ్రఫీ అందిచనున్నారు.