చిరంజీవి నీడలోనే పైకొచ్చాం : అల్లు అర్జున్

chiru-allu-arjun

తన విభిన్నమైన మాటతీరుతో, యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులతో స్టైలిష్ హీరోగా పిలిపించుకుంటున్న హీరో.. అల్లు అర్జున్. అల్లు అర్జున్‌కి ఎవరు ఆదర్శం అనే ప్రశ్న రాగానే మొదట వినిపించే సమాధానం.. చిరంజీవి పేరు. తన నటనతో, స్టార్ స్టేటస్‌తో తెలుగు సినిమాల్లో దశాబ్దాల పాటు నెంబర్ వన్ హీరోగా పేరు తెచ్చుకున్న చిరంజీవి, చాలామంది నటులకు ఆదర్శమనడంలో అతిశయోక్తి లేదు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ చాలాసార్లు బహిరంగ వేదికలపైనే చెప్పారు. ఇప్పుడు తాజాగా రుద్రమదేవి ఆడియో ఆవిష్కరణలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన రుద్రమదేవి ఆడియో ఆవిష్కరణ వేడుక వరంగల్‌లో పలువురు సినీ, రాజకీయ నాయకుల సమక్షంలో జరిగింది. రుద్రమదేవిలో గోనగన్నారెడ్డి పాత్రలో కనిపించనున్న అల్లు అర్జున్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిరంజీవి తనకు ఆదర్శమన్న విషయాన్ని తెలిపారు. చిరంజీవి ఎండనకా వాననకా కష్టపడి తమకొక స్టేటస్ ఇచ్చాడనీ, ఇప్పుడు తాము ఆ నీడలోనే హీరోలుగా ఎదిగామని తెలిపారు. తనమటుకు తనకు చిరంజీవి తర్వాతే ఎవ్వరైనా అని అన్నారు. ఇంతమంది ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించడం చిన్న విషయం కాదనీ, ఎవరినీ కించపరచడు కాబట్టే ఆయన ఆ స్థాయిని పొందారని అల్లు అర్జున్ అన్నారు. ఇక అల్లు అర్జున్ తాజా చిత్రాల విషయానికి వస్తే.. ఆయన హీరోగా రూపొందిన సన్నాఫ్ సత్యమూర్తి ఎప్రిల్ 2న విడుదల కానుంది.

Exit mobile version