“గని” సినిమా నేను చూశా.. చాలా బాగుంది – అల్లు అర్జున్

Published on Apr 3, 2022 3:05 am IST


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కిన చిత్రం “గని”. అల్లు అరవింద్ సమర్పణలో రెనైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపెనీలపై సిద్దు ముద్ద మరియు అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా శనివారం వైజాగ్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ వైజాగ్ తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, నా తొలి చిత్రం నుంచి ఇప్పటిదాకా అన్ని చిత్రాలన్నీ ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయని అన్నాడు. ఎప్పుడు వైజాగ్ వచ్చినా నాకు ఏదో ఒక మాధుర్యం ఉంటుందని చెప్పాడు. గని చిత్రంతో తన సోదరుడు అల్లు బాబీ నిర్మాతగా సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నానని అన్నాడు. నిర్మాత సిద్ధు ముద్దా కూడా సినిమా రంగంలోకి రావడానికి చాలా కష్టపడ్డాడని ఈ సినిమాతో విజయం అందుకుంటాడని నమ్ముతున్నానని అన్నాడు.

ఇక వరుణ్ తేజ్ గురించి చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి వరుణ్ అంటే చాలా ఇష్టమని, ఇప్పుడు వరుణ్ అంటే ఎంతో గౌరవమని అన్నాడు. ఏదో సినిమాలు చేయాలన్న ఉద్దేశంతో వరుణ్ కథలను ఎంచుకోడని, తనకంటూ ప్రత్యేక శైలి ఏర్పరచుకున్నాడని, కథల ఎంపికలో ట్రెండ్ ను ఫాలో కాకుండా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని తపిస్తుంటాడని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. అయితే ఇంత ఖర్చు పెట్టి కొత్త దర్శకుడితో సినిమా చేయడం నిజంగా సాహసమే అని, ఈ సినిమా కోసం వరుణ్ చాలా కష్టపడ్డాడని అన్నాడు. గని సినిమాను నేను చూశాను.. చాలా బావుందని అన్నాడు. నీ కసి, నీ హార్డ్ వర్క్ కు ఫలితం ఇచ్చేలా గని హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని అల్లు అర్జున్ అన్నాడు.

సంగీత దర్శకుడు తమన్ పట్టిందల్లా బంగారం అవుతుందని, ఈ సినిమాతో మరో హిట్ అతడి ఖాతాలో పడుతుందని అన్నాడు. దర్శకుడు కిరణ్ కు తొలి చిత్రమే అయినా ఎంతో అనుభవం ఉన్నవాడిలా తీశాడని, కొత్తవాడు అయినా కిరణ్ ను అందరూ నమ్మారు. వాళ్లందరి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడని అల్లు అర్జున్ అన్నాడు.

సంబంధిత సమాచారం :