బాలయ్యలా డైలాగ్‌లు చెప్పడం అందరికీ సాధ్యం కాదు – అల్లు అర్జున్

Published on Nov 27, 2021 11:35 pm IST


నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అల్లు అర్జున్ నందమూరి కుటుంబానికి, తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని, మా తాత గారైన అల్లు రామలింగయ్యకు, స్వర్గీయ ఎన్టీఆర్‌కు ఎంతో సాన్నిహిత్యం ఉండేదని అన్నారు. తన తండ్రి అల్లు అరవింద్, బాలకృష్ణ ఒక తరం వ్యక్తులని అన్నారు. ఇక తాను చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగానని, అలాంటి నేను ఈ రోజు బాలయ్య గారి ఫంక్షన్‌కు రావడం స్వీట్ మొమరీ అని అన్నారు.

బోయపాటి గురించి చెప్పాలంటే నన్ను ఆయన ఎంతో గౌరవిస్తారని, నా కెరీర్‌లో సాలిడ్ హిట్ ఇచ్చిన వ్యక్తి అని అన్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని సింహా, లెజెండ్‌ చూశారని.. ఇప్పుడు అఖండ అన్‌స్టాపబుల్‌ అవుతుందని అన్నారు. ఇక శ్రీకాంత్ తమకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అని, ఎంతో సున్నితమైన వ్యక్తి శ్రీకాంత్ అని, అలాంటి వ్యక్తి ఎలా విలనిజం చేస్తాడో అని ఆశ్చర్యపోయానని, నిజంగా విస్మయానికి గురిచేసేలా ఈ సినిమాలో శ్రీకాన్య్ విలన్ పాత్ర పోషించారని, ఈ సినిమాతో మీరొక సరికొత్త శ్రీకాంత్‌ను చూస్తారని అన్నారు.

ఇక బాలకృష్ణ గురుంచి చెబుతూ ఆయన ఈ స్థాయిలో ఉన్నారంటే సినిమా అంటే ఆయనకున్న డెడికేషన్‌, అడిక్షన్ అని అన్నారు. బాలయ్య డైలాగ్ చెప్పినట్లు ఎవరూ చెప్పలేరని, రెండు పేజీలు అయినా, మూడు పేజీలు అయినా ఒకే తీవ్రతతో డైలాగులు చెప్పడం అందరికీ సాధ్యం కాదని అన్నారు. బాలకృష్ణ రీల్‌లో అయినా, రియల్‌గా అయినా ఒకేలా ఉంటారని, ఆయనలోని ఈ అంశం నాకు బాగా నచ్చుతుందని అన్నారు. ఫైనల్‌గా అఖండ మూవీ అఖండ జ్యోతిలా వెలగాలని, ఈ సినిమా భారీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.

సంబంధిత సమాచారం :