‘పుష్ప’ సక్సెస్ నాది కాదు.. మీ అందరిది – అల్లు అర్జున్

Published on Dec 22, 2021 8:32 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప” డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ సందర్భంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో అభిమానుల కోలాహలం మధ్య ఈ సినిమా సక్సెస్ పార్టీ జరిగింది. చిత్ర యూనిట్ అందరూ ఇందులో హాజరయ్యారు.

పుష్ప గ్రాండ్ సక్సెస్ పార్టీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమా కోసం తాను పడిన కష్టం కంటే చిత్ర యూనిట్ ఇంకా ఎక్కువ కష్టపడ్డారు అంటూ అందరినీ ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ’ రెండు సంవత్సరాలుగా చిత్తూరు గురించి బాగా తెలుసుకుంటున్నాను. ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళ భాష యాస ఎలా ఉంటుంది.. అనేది అన్ని నేర్చుకున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఒక్క ఈవెంట్ అయినా చిత్తూరులో పెట్టాలి అనుకున్నాము. అనుకున్నట్టుగానే మొదటి ఫంక్షన్ ఇక్కడ చేయడం ఆనందంగా ఉంది. సుకుమార్ అంటే సుకుమారంగా ఉంటారు అనుకుంటిరా ఫైర్.. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. పుష్ప నుంచి నాకు పేరు వచ్చిన.. ఇంకేది వచ్చిన అంతా మా సుకుమార్ గారిదే. ఇంకా ఇంతకంటే సినిమా గురించి నేనేం చెప్పలేను. మీ వెనకాల ఆ ఏడుకొండల స్వామి ఎలా ఉన్నాడో.. నా వెనకాల మా సుకుమార్ అలా ఉన్నాడు.. ఇంతకంటే ఇంకా ఏం చెప్పాలి. మా శ్రీవల్లి కేవలం సినిమాలో మాత్రమే కాదు బయట కూడా చాలా నచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ పాటలు ఎలా ఉన్నాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఒక భాషలో కాదు అన్ని భాషల్లో ఇంత అద్భుతంగా పర్ఫామెన్స్ చేస్తుంటే థాంక్యూ తప్ప ఇంకేమీ చెప్పలేకపోతున్నాను. బడ్జెట్ విషయంలో అన్నిట్లోనూ మాకు ఎప్పుడూ అండగా నిలిచిన మైత్రి మూవీ మేకర్స్ కు థాంక్స్. ముత్తంశెట్టి మీడియాకు కూడా నేను తిరిగి ప్రేమ చూపించే టైం వచ్చింది. సినిమాలో నాతో పాటు నటించిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్. మీరు అంత బాగా సపోర్ట్ చేశారు కాబట్టే నా పర్ఫామెన్స్ బాగుంది. సినిమా ఇంత పెద్ద విజయం అందించినందుకు మరోసారి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అని తెలిపారు.

హీరోయిన్ రష్మిక మందన మాట్లాడుతూ అల్లు అర్జున్ గారు మీకు నేను ఫ్యాన్ కాదు అంతకు మించి సినిమాలో ఎంత అద్భుతంగా నటించారు..? ఖచ్చితంగా ఈ ఏడాది నేషనల్ అవార్డులతో పాటు అన్ని అవార్డులు మీకు రాకపోతే నేను హర్ట్ అవుతాను. సుకుమార్ గారు మీ డైరెక్షన్ సూపర్.. మీ ఇద్దరు కలిసి చించేశారు. స్క్రీన్ మీద ఎనర్జీ చూస్తుంటే మాట్లాడటానికి మాటలు సరిపోవడం లేదు. డీఎస్పీ గారు మీ పాటలు అద్భుతం. ప్రతి ఒక్క పాట అదిరిపోయింది. మా టీంకు ఎక్కువగా దిష్టి తగులుతుంది. అందుకే ఆ దిష్టి నేను తీసుకుంటున్నాను. పుష్ప సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ ఎంతో కష్టపడ్డారు. కావాల్సిన ప్రతి ఒక్కటి కాదనకుండా ఇచ్చారు. ఈరోజు ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది అంటే దానికి కారణం మైత్రి మూవీ మేకర్స్. సునీల్ గారు మీరు అద్భుతంగా నటించారు. మొదటి సారి మిమ్మల్ని చూసినట్టు గుర్తు పట్టలేకపోయాను. కుబా సర్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ సార్ మీది. సినిమా ఇంత అద్భుతంగా వచ్చిందంటే దానికి మీరు కూడా ఒక ప్రధానమైన కారణం. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు.

పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులకు ప్రశంసల వర్షం కురిపించేలా చేసింది అనసూయ భరద్వాజ్. ఈమె పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ కార్యక్రమంలో అనసూయ మాట్లాడుతూ సినిమా ఇంత అద్భుతమైన విజయం సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అల్లు అర్జున్ మేకోవర్ నేను ఊహించలేదు. ఆయన ఒక అద్భుతం. ఒక క్యారెక్టర్ కోసం ఇంతగా మారిపోవడం ఆయనకు మాత్రమే సాధ్యం. నా జీవితంలో మీరు చాలా కీలక పాత్ర పోషించారు అల్లు అర్జున్ గారు. మీరంటే నాకు చాలా ఇష్టం.. ఆ విషయం చెప్పకనే చెప్పాను. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా అన్ని చోట్ల ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఆనందంగా ఉంది. సుకుమార్ గారి గురించి ఏం చెప్పాలి.. ఆయన నాకు గురువు.. మిమ్మల్ని చాలా విసిగించాను.. నటిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. సినిమాలో దాక్షాయని పాత్ర డోస్ సరిపోలేదు అని అభిమానులు చెబుతున్నారు. రెండో భాగం ఆడుకుంటాను. ఇలాంటి సినిమా నిర్మించాలంటే కేవలం మైత్రి మూవీ మేకర్స్ కు మాత్రమే సాధ్యమవుతుంది. వాళ్లకు ఉన్న డెడికేషన్ అలాంటిది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుకుమార్ గారికి, అల్లు అర్జున్ గారికి, మైత్రి మూవీ మేకర్స్ కు ధన్యవాదాలు అని తెలిపారు.

సినిమాలో మంగళం శీను పాత్రలో అద్భుతంగా నటించిన సునీల్ ఈ వేడుకలో మాట్లాడుతూ అందాల రాముడు సినిమాలో హీరోగా నటించినపుడు నా జర్నీ ఇక్కడి నుంచే మొదలైంది. ఇప్పుడు మళ్లీ విలన్‌గా కూడా ఇక్కడి నుంచే మొదలైంది. అంతా శ్రీ వెంకటేశ్వర స్వామి దయ. తెలుగులో మాత్రమే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో కూడా అదే వైబ్రేషన్ రావడం పుష్ప సినిమాకు ఉన్న స్పెషల్. ఒక భాషలో కాదు ఈ సినిమాతో అన్ని భాషల్లో విలన్ అయిపోయాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుక్కు డార్లింగ్ కు జీవితాంతం రుణపడి ఉంటాను. ఒక భాషలో కాదు అన్ని భాషల్లో ఒకేసారి గుర్తు తెచ్చుకో అంటూ బన్నీ గారు నన్ను విసిరి కొట్టేసారు. నన్ను సీరియస్ పాత్రలో కూడా చూసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. పుష్ప సినిమా ఇంకా అద్భుతమైన విజయం సాధిస్తుందని అన్నారు.

సంబంధిత సమాచారం :