ఇంటర్వ్యూ : అల్లు శిరీష్ – నా నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది !

అల్లు శిరీష్ హీరోగా రూపొందిన చిత్రం ‘ఒక్క క్షణం’ నిన్న గురువారం రిలీజై మంచి పజైటీవ్ మౌత్ టాక్ తో నడుస్తోంది. ఈ సందర్బంగా శిరీష్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉంది ?

జ) చూసిన అందరు సినిమా బాగుందని అంటున్నారు. నా నటనకు మంచి గుర్తింపు లభిస్తోంది. నా గత సినిమాలకంటే ఈ సినిమాలో యాక్టింగ్ బాగుందని చెప్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు బాగా చేశానని మెచ్చుకుంటున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ చూస్తుంటే హ్యాపీ గా ఉంది.

ప్ర)ఈ కథ ఒప్పుకోవడానికి కారణం. ?
జ)నేను గతంలో రెండు లవ్ స్టోరీస్ చేశాను. ఈ కథ నాకు కొత్త కావడంతో వెంటనే ఒప్పుకున్నాను. దర్శకుడు ఆనంద్ 40 నిమిషాలు ఈ స్టోరీ చెప్పడం జరిగింది. విన్న వెంటనే థ్రిల్ అయ్యాను. ఈ కథ మీద నమ్మకంతో వేరే కథలు ఒప్పుకోలేదు.

ప్ర)ప్యార్లల్ లైఫ్ గురించి ?

జ) ఈ సబ్జెక్టు విన్న తరువాత నిజంగా ప్యార్లల్ లైఫ్ ఉంటుందా అనే అనుమానం కలిగింది. తరువాత గూగుల్ లో చూడ్డం జరిగింది. ఈ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి చేశాను కాబట్టి సినిమాలో నా నటనకు మంచి పేరు వస్తోంది.

ప్ర) బన్నీ, అల్లు అరవింద్ గారి ఇన్వాల్వ్ మెంట్ ఎంతవరకు ఉంది ?

జ) అన్నయ్యకు కథ తెలీదు. ఫైనల్ కాపీ రెడీ అయ్యాక వచ్చి చూశారు. ఆయనకు నచ్చింది. నాన్న కథ విన్న తరువాత చిన్న చిన్న మార్పులు చెప్పారు. సినిమా షూట్ పూర్తయ్యాక నాన్న చూసి సినిమా బాగుందని మెచ్చుకున్నారు.

ప్ర)సినిమా క్యాస్టింగ్ మీ ఎంపికేనా ?

జ)లేదండి. సురభి, మణిశర్మ, దాసరి అరుణ్ కుమార్, అవసరాల శ్రీనివాస్ ఇలా అందరినీ డైరెక్టర్ ఆనందే సెలెక్ట్ చేసుకున్నారు.

ప్ర)పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ?

జ)ఈ సినిమాలో పాటలు బాగుండాలని అంతకంటే రీరికార్డింగ్ బాగుండాలని డైరెక్టర్ చెప్పారు. నేను మణిశర్మ గారైతే బాగుంటుందని చెప్పాను. అలాగే శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫి చాలా బాగుంది. వీలైతే ఆయనతోనే నెక్స్ట్ సినిమా చేస్తాను.

ప్ర)ఒక హీరోగా మీరు ఎలాంటి గుర్తింపు కావాలని కోరుకుంటున్నారు ?

జ) నాకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టం. ఫ్యామిలీ స్టోరీస్ అంటే కూడా ఇష్టం. అన్నయ్య చేసినట్లు ‘వేదం, రుద్రమదేవి’ సినిమాల్లో లాంటి పాత్రలు వస్తే చేస్తాను.

ప్ర)మీతో చేసే నిర్మాతలకు మీరిచ్చే సలహా ?

జ)మంచి బయ్యర్లను ఇవ్వండి అంటాను. అలాగే వర్కింగ్ డేస్ తగ్గించి బడ్జెట్ లో సినిమా చెయ్యమని చెప్తాను. పబ్లిసిటీ బాగుండాలని కోరుకుంటాను.

ప్ర) మీ తదుపరి సినిమాలు ?

జ)రెండు మూడు కథలు ఉన్నాయి. త్వరలో వెల్లడిస్తాను. నాకు కొత్త దర్శకులతో పని చెయ్యాలని ఉంది. ఒక వారంలో కొత్త సినిమా వివరాలు చెప్తాను.