లవ్‌, డ్రామా తోపాటు కొన్ని సెన్సేషనల్ అంశాలు ‘మళ్ళీ పెళ్లి’ లో వున్నాయి – ఎం ఎస్ రాజు

లవ్‌, డ్రామా తోపాటు కొన్ని సెన్సేషనల్ అంశాలు ‘మళ్ళీ పెళ్లి’ లో వున్నాయి – ఎం ఎస్ రాజు

Published on May 21, 2023 2:08 AM IST

సీనియర్ నరేష్ వి.కె గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్ళీ పెళ్లి’ ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో అందరిలో మంచి బజ్ ని క్రియేట్ చేసింది. యూనిక్ కథతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ లో పవిత్ర లోకేష్ కథానాయిక. దీనికి మెగా మేకర్ ఎం ఎస్ రాజు రచన దర్శకత్వం వహిస్తున్నారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌ పై నరేష్ స్వయంగా దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీ మే 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎం ఎస్ రాజు చెప్పిన ఇంటర్వ్యూ విశేషాలు.

మళ్లీ పెళ్లి కథ ఎలా వుంటుంది?

ఈ సినిమాను మల్టీస్టారర్‌ అనాలో, ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ అనాలో నాకే అర్థంకాలేదు. డిసెంబర్‌ 30 నుంచి రకరకాల ప్రమోషన్‌ లో ఈ సినిమా కథేమిటనేది ప్రేక్షకులకు తెలిసిపోయింది. పక్కవాడి జీవితంలో తొంగిచూడాలనే ఆతృత జనాల్లో వుంటుంది. ఒకరకంగా చెప్పాలంటే, మనం ఊరు వెళితే కాలక్షేపం కబుర్లు వస్తుంటాయి. అలా అని ఈ సినిమా అలాంటిది కాదు. నా కెరీర్‌ లో చాలా కష్టపడి చేసిన సినిమా. విజయనిర్మల, కృష్ణ గారు పెట్టిన బేనర్‌. నరేష్‌ గారి 50 ఏళ్ళ కెరీర్‌ ను బేస్ చేసుకుని మంచి సినిమా చేయాలని నేనొక కథ చెప్పా. అది వారు విని, ఫ్రీడం ఇచ్చారు. ఎంత డెప్త్‌ లోకి వెళతారో వెళ్ళండి అన్నారు. నేను రాశాను. అయితే ఇది నా కథా, నరేష్ కథా అనేది రేపు మీరు చూసి తెలుసుకోవచ్చు.

 

మీరు అనుకున్నట్లు కథను తీయగలిగారా?

నేను ఇంతకుముందు పెద్ద హీరోలతో చేశాను. డర్టీ హరి సినిమా కొత్తవారితో చేశాను. ఓటీటీలో సెస్సేషనల్‌ అయింది. అందుకే తప్పటడుగు వేయకుండా ఈ సినిమాను తెరకెక్కించాం. వారిద్దరూ గొప్ప నటులు. వయస్సు మీద వున్నారు. కనుక వారి జీవితంలో జరిగిన కథ అని అనుకోవచ్చు. కానీ ఈ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పను. కానీ ఈ సినిమాకు బెస్ట్‌ స్క్రీన్‌ ప్లే ఇచ్చాను. మొత్తంగా సినిమాపై చాలా నమ్మకంతో వున్నాను. లవ్‌, డ్రామాతోపాటు కొన్ని సెస్సేషనల్‌ అంశాలు ఇందులో వున్నాయి.

 

మెచ్యూర్డ్‌ లవ్‌స్టోరీ అన్నారు. ఈ కథను నరేష్‌, పవిత్రను దృష్టిలో పెట్టుకుని రాశారా?

నేను ఒక్కడు సినిమా రాసేటప్పుడు మహేష్‌బాబు అనుకోలేదు. కథంతా వచ్చాక తనే బాగుంటాడని అనుకున్నాం. ఇక మళ్లీ పెళ్లి కథ వచ్చేసరికి ఇది అందరికీ కనెక్ట్‌ విధంగా వుంటుంది. అయితే ఇది మొత్తం కల్పితం అని చెప్పలేను.

 

ఇందులో రియల్‌ సంఘటనలు ఎంత మేరకు వుంటాయి?

రియల్‌ సంఘటనలు వుంటాయని టీజర్‌, ట్రైలర్‌ చూస్తే అనిపిస్తుంటుంది. సినిమా చూశాక ఎంత మేరకు వుంటుందో మీరే చూసి చెబుతారు.

 

ఇది హైప్రొఫైల్‌ కాంట్రవర్సీ సినిమా అవుతుందా?

ఒకరు కన్నడ, మరొకరు తెలుగులో ఆర్టిస్టులు. మిడిల్‌ ఏజ్‌. ఇద్దరూ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు అనే సరికి కొంతమందికి కనెక్ట్‌ అయినా అవ్వవచ్చు. ఇప్పటి జనరేషన్‌ లో చాలా మార్పు వచ్చింది. అందరూ ఇండివిడ్యువల్‌ గా బతకాలనుకుంటున్నారు. ఆ కోవలో ఈ కథ వుంటుంది. ప్రేక్షకుడిని కొత్త లోకాన్ని చూపించాలని చేసిన సినిమా ఇది.

 

ఇద్దరిలో నటనాపరంగా మీరు గమనించిన అంశాలు ఏమిటి?

ఇద్దరూ గొప్ప నటీనటులే. వారి నుంచి 50 శాతం పైగా నటన రాబట్టాను. బయట నరేష్‌ సరదాగా వుంటారు. కానీ రెడీ టేక్‌ అనగానే సీన్‌ లో ఎమోషన్స్‌ లో జీవించేస్తారు. ఆయన పెర్‌ఫార్మెన్స్‌ కు చాలాసార్లు సెట్లో చప్పట్లు కొట్టేవారు. అయినా సరే ఇంకో టేక్‌ అని అడిగితే విసుక్కోకుండా చేసేవారు.

 

ఈ సినిమా ఎంతవరకు సెస్సేషనల్‌ అవుతుంది?

ఒకప్పుడు జనరేషన్‌ ఇరువైపులా అమ్మాయిని, అబ్బాయిని చూపించకుండాపెద్దలు చూసి చేసేవారు. ఆ తర్వాత ఫోటోలు చూపించే స్థాయికి మార్పు వచ్చింది. ఇప్పుడు అంతకుమించి అనే రీతిలో పెండ్లికిముందుగానే వాట్సప్‌ ద్వారా మెసేజ్‌లు కలుసుకోవడం జరిగిపోతుంది. కాలాన్ని బట్టి పరిస్థితులు, ఆలోచనలు మారిపోతుంటాయి. అదే నా సినిమాలో వుంటుంది. మనకు ఎలా బతికితే సంతోషమో అలా బతకమని చెప్పేదే సినిమా. అలా అని విచ్చలవిడితనం లేదు.

 

మీరు ట్రెండీగా సినిమాలు తీస్తున్నారు?

ఒక్కడు, నువ్వొస్తావంటే నేనొద్దటానా అలా ట్రెండీగా తీసినవే. డర్టీ హరి కూడా అలాంటిదే. ఆ సినిమా చేయమని యూత్‌ దర్శకుడిని అడిగితే చాలా బోల్డ్‌ కంటెంట్‌ చేయనన్నాడు. అప్పుడు నేనే దర్శకత్వం వహించా. ఏదైనా కొత్తదనంతో తీయాలనే తపనతో నేను దర్శకునిగా మారాను. లేదంటే ఇంట్లో కూర్చునేవాడిని.

 

మళ్లీ పెళ్లి అనేది కృష్ణగారి పాత సినిమాటైటిల్‌, అది ఎందుకు పెట్టారు?

మొదట్లో నాకు కృష్ణగారి సినిమా టైటిల్‌ అని తెలీదు. నరేష్‌ గారే ఆ తర్వాత చెప్పారు. ఇంకేం పర్వాలేదు అని టైటిల్‌ పెట్టాం.

 

మారిన సొసైటీని బట్టి తీశారన్నారు. ఈ సినిమా అంతటితో ఆగిపోతుందా. ఇంకా నెక్ట్‌ స్టెప్‌ కు వెళుతుందా?

సొసైటీలోని మార్పుకు అనుగుణంగానే సినిమా ఉంటుంది. అంతకంటే మోతాదు మించదు.

 

ముందుగా ఈ కథను ఎవరితో షేర్‌ చేసుకున్నారు?

నరేష్‌, పవిత్రగారితోనే షేర్‌ చేసుకున్నాను. ఇద్దరూ కాంట్రవర్సీ పర్సన్స్‌కాదు. ఇద్దరూ చాలా ఎడ్యుకేటెడ్‌ పర్సన్‌. కథ బాగుంది ప్రొసీడ్‌ అన్నారు.

 

ఈ కథలో ఎంత నిజాయితీ వుంటుంది?

ఒంటరితనం అనేది ఎలా ఉంటుందో అనేది నిజాయితీగా చూపించాం. గతంలో కృష్ణగారు, విజయనిర్మలగారి సినిమాలు కొన్ని బోల్డ్‌ గా వున్నాయి. వాటిని మించిన విధంగా మాత్రం ఉండదు.

 

మీ వల్లే సినిమాకు హైప్‌ వచ్చింది అనిపిస్తుంది?

నా వల్ల వచ్చింది కాదు. వారితో నా కలయిక వల్ల వచ్చిందనుకుంటున్నా. ఒక్కడు తీసుకుంటే మహేష్‌బాబు, నేను, గుణశేఖర్‌ వుండబట్టే హైప్‌ వచ్చింది. ఇది అంతే అని ముగించారు ఎం ఎస్ రాజు…

థాంక్యూ ఆల్ ది బెస్ట్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు