మెగాస్టార్ సినిమాలో అమితాబ్ బచ్చన్ ?


‘ఖైదీ నెం 150’ విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రంపై అందరిలోనూ బోలెడంత క్యూరియాసిటీ ఉంది. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుని అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత రామ్ చరణ్. అంతేగాక బాహుబలి తర్వాత తెలుగు సినిమాకు బాలీవుడ్లో ఆదరణ పెరిగిన నైపథ్యంలో అక్కడ సినిమాకు మార్కెట్ కల్పించేందుకు గొప్ప ప్లాన్ వేశారు.

అదేమిటంటే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను ఇందులో నటింపజేయడం. ఈమేరకు ఇప్పటికే అమితాబ్ తో చర్చలు ముగిశాయని, ఆయన కూడా సుముఖంగానే ఉన్నారని వార్తలొస్తున్నాయి. గతంలో కూడా ఒక కార్యక్రమంలో చిరంజీవితో కలిసి నటించాలని ఉందని అమితాబ్ తన మనసులో మాటని వెలిబుచ్చారు కూడా. మరి ఆ మాట ప్రకారమే అయన ఈ సినిమాలో నటిస్తారో లేదో తెలియాలంటే మెగా కాంపౌండ్ నుండి కన్ఫర్మేషన్ వచ్చే వరకు వేచి చూడాలి. ఒకవేళ ఆయనే గనుక నటిస్తే చిరు, చరణ్ లు అనుకున్నట్టు ఈ సినిమా జాతీయస్థాయి ప్రాజెక్టుగా తయారవడం ఖాయం. ఇకపోతే ఈ చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్నారు.