‘బేబీ’ ఫేమ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ’90s’ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సెప్టెంబర్ 11, 2026న విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండగా, ప్రమోషన్లలో భాగంగా హీరో ఆనంద్ దేవరకొండ విలేకరుల సమావేశంలో పలు విశేషాలు పంచుకున్నాడు.
ఎపిక్ సినిమా ఎలా ఉండబోతుంది?
‘ఎపిక్’ సినిమాపై మా టీమ్ అంతా మొదటి నుంచి ఎంతో నమ్మకంగా ఉన్నాం. 80s, 90s, 2000s ఇలా ఏ జనరేషన్ వారికైనా, కుటుంబానికి దూరంగా ఉండే ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. ఒక మధ్యతరగతి యువకుడి ప్రేమ, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలను అద్దంలో చూసుకున్నంత సహజంగా ఇందులో చూపించాం. ఇది రెగ్యులర్ సినిమా కాకుండా, ప్రతి ఒక్కరి నిజ జీవితాన్ని ప్రతిబింబించే ఒక అందమైన జర్నీలా ఉంటుంది.
ఆదిత్య పాత్రలో మిమ్మల్ని మీరు చూసుకున్నారా?
‘ఎపిక్’ కథ వింటున్నప్పుడే నూటికి నూరు శాతం ఇది నా సొంత కథలాగే అనిపించింది. నేను కూడా అమెరికాలో చదువుకున్నాను కాబట్టి, లైఫ్‌లో సెటిల్ అవ్వడానికి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి కుటుంబాలకు దూరంగా విదేశాల్లో ఉండే ప్రతి తెలుగు విద్యార్థికి ఈ సినిమా ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అవుతుంది.
ఆదిత్య పాత్ర ఎలా ఉండబోతుంది?
నేను పోషించిన ఆదిత్య పాత్ర చాలా ఇన్నోసెంట్ గా, ప్రతి విషయంలో కన్ఫ్యూజ్ అయ్యే యువకుడిలా ఉంటుంది. లైఫ్‌లో తనకి నచ్చింది చేయాలా, పేరెంట్స్ కోసం బ్రతకాలా, తను ప్రేమించిన అమ్మాయితో జీవితాంతం ఉండగలనా అనే సందేహాల నడుమ అతని ఆలోచనలు సాగుతాయి. ఇందులో ప్రతి సన్నివేశం, సంభాషణ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటాయి.
బేబీ ప్రభావం ఈ సినిమాపై ఎంతవరకు ఉంటుంది?
‘బేబీ’ అంత పెద్ద హిట్ అయ్యాక నేను, వైష్ణవి మళ్ళీ కలసి నటిస్తున్నాం కాబట్టి ఆ పోలిక రావడం సహజమే. అయితే ‘బేబీ’ ఒక సంచలనమైతే, ‘ఎపిక్’ ఒక అందమైన ప్రయాణం లాంటిది – రెండింటికీ ఏమాత్రం పోలిక లేదు. మా కాంబినేషన్ తో పాటు ’90s’ సిరీస్ ద్వారా ఆదిత్య హాసన్ సంపాదించుకున్న క్రేజ్ కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ అవుతుంది.
90s సిరీస్ కి కొనసాగింపుగా ఎపిక్ సినిమా ఉంటుందా?
’90s’ సిరీస్‌కి ఇది సీక్వెల్ కాదు, కానీ ఆ ప్రపంచం మరియు పాత్రల నుంచి పుట్టిన కథ. చిన్న కొడుకు ఆదిత్య విదేశాలకు చదువుకోవడానికి వెళ్లినప్పుడు అక్కడ ఏం జరిగిందనేదే ‘ఎపిక్’. ’90s’ ఒక ఫ్యామిలీ స్టోరీ అయితే, ఇది లవ్ స్టోరీ. అయినప్పటికీ ఆ సిరీస్‌లో ఉన్నట్టే ఇందులోనూ సహజమైన హాస్యం, హత్తుకునే భావోద్వేగాలు ఉంటాయి.
వైష్ణవి చైతన్య పోషించిన కడలి పాత్ర ఎలా ఉండబోతుంది?
కడలి పాత్ర ప్రతి అమ్మాయికి బాగా కనెక్ట్ అవుతుంది. ఒక అమ్మాయి పైకి నవ్వుతూ కనిపించినంత మాత్రాన సంతోషంగా ఉన్నట్టు కాదు; ఆమె వెనుక ఎన్నో భయాలు, బాధ్యతలు ఉంటాయి. అలాంటి లోతైన భావోద్వేగాలు ఉన్న పాత్రే ఈ ‘కడలి’.
మీ నెక్స్ట్ చిత్రాల గురించి?
‘తక్షకుడు’ చిత్రంతో పాటు ఒక ఇండో-కొరియన్ ప్రాజెక్ట్ షూటింగ్‌ను కూడా ఇప్పటికే పూర్తి చేశాను.
