మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రధారులుగా ఉషారాణి మూవీస్ బ్యానర్ మీద వల్లూరి రాంబాబు నిర్మాతగా టి.వి. రవి నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాస్తవ్ కెమెరామెన్‌గా పని చేశారు. కార్తిక్ కోడకండ్ల సంగీతాన్ని అందించారు. ఎం. రవి కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఈ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంబికా కృష్ణ, రేలంగి నరసింహారావు తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
దర్శకుడు టి.వి. రవి నారాయణ్ మాట్లాడుతూ.. ‘అందరిలాగే చిరంజీవి గారిని చూసి అభిమానిగా మారి ఇండస్ట్రీలోకి 2012లో వచ్చాను. చిరంజీవి అభిమానిగా, పవన్ కళ్యాణ్ అభిమానిగా ఒక మంచి పని చేయాలి, ఒక మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఉండేవాడిని. డొక్కా సీతమ్మ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు నాలో ఎంతో స్ఫూర్తిని నింపాయి. ఒక అభిమానిగా ఆ సినిమాను తీసి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి అంకితం చేద్దాం అనుకున్నాను. డొక్కా సీతమ్మ గారి చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను ప్రారంభించాం. డబ్బు కోసం నేను ఈ సినిమాను మొదలుపెట్టలేదు. ఓ మహనీయురాలి చరిత్రను తెలుగువాళ్లు అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతోనే ఈ సినిమా మొదలుపెట్టాం. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ప్రొడ్యూసర్ గారు, మా టీమ్ అంతా కలిసి విరాళంగా ఇస్తాం. డొక్కా సీతమ్మ పేరు మీద ఉన్న పథకానికి ఆ డబ్బులు విరాళంగా ఇస్తాం. మొదటి సినిమానే డొక్కా సీతమ్మ లాంటి మహనీయురాలైన కథతో చేస్తుండటం నా అదృష్టం. నా మొదటి చిత్రానికి సుచిత్రమ్మతో ఓ పాట చేయించాలని అనుకున్నాను. చంద్రబోస్ గారు ఇచ్చిన మాట సాయంతోనే ఈ సినిమా స్థాయి పెరిగింది. ఆమని గారు అద్భుతంగా నటించారు. మురళీ మోహన్ గారు అందించిన సహకారాన్ని మర్చిపోలేను. ఆర్ట్ డైరెక్టర్ రవన్న అద్భుతంగా సెట్స్ వేశారు. త్వరలోనే ట్రైలర్‌తో వస్తాం. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.
మురళీ మోహన్ మాట్లాడుతూ .. ‘డొక్కా సీతమ్మ వంటి మహనీయురాలి కథతో సినిమాను చేస్తున్నాం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. వచ్చిన ప్రతీ ఒక్కరికీ కడుపునిండా అన్నం పెట్టి పంపేవారు. ఇలాంటి గొప్ప వారి గురించి ప్రస్తుత తరానికి తెలియాలి. డైరెక్టర్ రవి గారు చాలా రీసెర్చ్ చేసి ఈ కథను తయారు చేశారు. ఆమని చాలా మంచి ఆర్టిస్ట్. అలాంటి గొప్ప ఆర్టిస్ట్‌కు డొక్కా సీతమ్మ పాత్ర వచ్చింది. ఆమని గారికి ఈ సినిమాతో జాతీయ అవార్డు రావాలి. అందరూ ఈ సినిమాను చూడాలి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
ఆమని మాట్లాడుతూ.. ‘దర్శకుడు వచ్చి డొక్కా సీతమ్మ గారి కథను చెప్పారు. దర్శకుడు కథ చెప్పిన తరువాత గూగుల్‌లో ఆమె గురించి సర్చ్ చేశాను. ఆవిడ ఎంత గొప్ప వ్యక్తి అన్నది నాకు అర్థమైంది. ఇలాంటి పాత్రలను చేయాలంటే రాసి పెట్టి ఉండాలి. ఇలాంటి పాత్ర దొరకడం నా అదృష్టం. మురళీ మోహన్ గారితో నటిస్తుండటం ఆనందంగా ఉంది. సుచిత్ర మాస్టర్ గారితో మళ్లీ పని చేస్తుండటం సంతోషంగా ఉంది. మంచి ఉద్దేశంతో ఈ చిత్రాన్ని చేస్తున్నాం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత రాంబాబు మాట్లాడుతూ .. ‘డొక్కా సీతమ్మ గారి కథను, చరిత్రను అందరికీ చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను తీస్తున్నాం. డొక్కా సీతమ్మగా ఆమని గారి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రానుంద’ని అన్నారు.
ఈ కార్యక్రమంలో అంబికా కృష్ణ, రేలంగి నరసింహారావు, సుచిత్ర చంద్రబోస్ తదితరులు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరారు.
