‘ధృవ’ అనుభవాలను పంచుకున్న అరవింద్ స్వామి!

29th, August 2016 - 11:55:22 PM

aravind-swamy
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘ధృవ’, తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. తమిళంలో గతేడాది విడుదలైన ఈ సినిమాలో నాటితరం స్టార్ హీరో అరవింద్ స్వామి విలన్‌గా నటించగా, ఆయన నటన సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ధృవలో కూడా విలన్‌గా అరవింద్ స్వామియే నటిస్తున్నారు. ‘తని ఒరువన్’ విడుదలై సరిగ్గా ఏడాది పూర్తి కాగా, ఈ సమయానికి తాను అదే సినిమాకు రీమేక్ అయిన ‘ధృవ’లో నటిస్తూ ఉండడం చాలా సంతోషంగా ఉందని అరవింద్ స్వామి తెలిపారు.

ఒరిజినల్ వర్షన్‌కు ఏమాత్రం తగ్గకుండా ఇందులో అరవింద్ స్వామి పాత్ర ఉంటుందట. రామ్ చరణ్ కూడా అరవింద్ స్వామి పాత్ర సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని చెబుతూ వస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.