మళ్ళీ రీమేక్‌తోనే మెప్పించనున్న అరవింద్ స్వామి?


1990వ దశకంలో తెలుగు, తమిళ భాషల్లో సూపర్ క్రేజ్‌తో దూసుకుపోయిన హీరో అరవింద్ స్వామి, ఇప్పుడు రీ ఎంట్రీలోనూ అదే స్థాయిలో మెప్పిస్తోన్న విషయం తెలిసిందే. రీ ఎంట్రీలో ‘తని ఒరువన్’ అన్న సినిమాతో దేశవ్యాప్తంగా ఒక్కసారే పాపులారిటీలోకి వచ్చిన అరవింద్, అదే సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన రామ్ చరణ్ నటించిన ‘ధృవ’లోనూ నటించి మెప్పించారు. ధృవ కోసం అరవింద్ స్వామి పాత్రను ఎవరితోనైనా చేయించాలని టీమ్ అనుకున్నా, అన్నీ ఆలోచించాక అరవిందే కరెక్ట్ అని ఆయనను ఒప్పించారు.

ఇక ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఆయన, తాజాగా తమిళంలో చేసిన బోగన్ అనే సినిమాతో మరో హిట్ కొట్టేశారు. గతవారం విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్ళతో దూసుకుపోతోంది. జయం రవి, హన్సిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అరవింద్ ఓ డిఫరెంట్ రోల్‌లో కనిపించారు. ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్స్ జరుగుతున్నాయని, తెలుగు రీమేక్ నిజంగానే ఉంటే, తాను మళ్ళీ ఈ పాత్రను చేసేందుకు నో చెప్పకపోవచ్చు అని అరవింద్ స్వామి అన్నారు. దీంతో తెలుగు రీమేక్ ప్లాన్స్ సజావుగా జరిగితే మరోసారి రీమేక్‌తోనే అరవింద్ స్వామి మెప్పిస్తారని ఆశించొచ్చు.