Asian Games 2026: పాక్‌ను చిత్తు చేసి గోల్డ్ మెడల్ గెలిచిన భారత్.. గేల్ రికార్డ్ బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ

పాకిస్తాన్‌తో జరిగిన హైవోల్టేజ్ ఫైనల్లో టీమిండియా 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. బ్యాటింగ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ సిక్సర్ల తుఫాన్ సృష్టించగా, ఆఖర్లో భారత బౌలర్లు క్రమశిక్షణతో బంతులేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పారు.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. వైభవ్ సూర్యవంశీ (15), సంజూ శాంసన్ (2) త్వరగానే పెవిలియన్ చేరారు. అయితే క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే అభిషేక్ శర్మ పాక్ బౌలర్లను చెండాడుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 28 బంతుల్లోనే 7 భారీ సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 61 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో (3,513 బంతుల్లో) 400 సిక్సర్ల మైలురాయిని తాకిన బ్యాటర్‌గా క్రిస్ గేల్ (3,557 బంతులు) రికార్డును తుడిచిపెట్టాడు.

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (21), ఇషాన్ కిషన్ (20) పరుగులు జోడించగా.. చివర్లో తిలక్ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 22 బంతుల్లో 4 సిక్సర్లు, 3 బౌండరీలతో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శివమ్ దూబే (27) మెరుపులు తోడవడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగుల భారీ స్కోరు సాధించింది.

హసన్ నవాజ్ ఒంటరి పోరాటం.. బౌలర్ల పట్టుదల

212 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఆదిలోనే సాహిబ్‌జాదా ఫర్హాన్ (10), ఉస్మాన్ ఖాన్(3), మాజ్ సదాకత్ (23) వికెట్లను కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా హసన్ నవాజ్ అద్భుతమైన పోరాటం కనబరిచాడు. 51 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 ఫోర్లతో 96 పరుగులు చేసి దాదాపు పాక్‌ను గెలుపు ముంగిటకు తెచ్చాడు.

కీలక సమయంలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి మ్యాచ్‌పై పట్టు బిగించారు. శివమ్ దూబే పాక్ సెట్ బ్యాటర్లు హసన్ నవాజ్, సైమ్ అయూబ్ (29) ఇద్దరినీ ఔట్ చేసికోలుకోలేని దెబ్బకొట్టాడు. అక్షర్ పటేల్ (2/29), వాషింగ్టన్ సుందర్ (2/29) కూడా చెరో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థి పరుగుల వేగాన్ని కట్టడి చేశారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 6 వికెట్లకు 192 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.

Exit mobile version