‘అర్జున్ రెడ్డి’కి అడిక్ట్ అయిపోయిన అభిమానులు !


యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేస్తున్న ప్రస్తుత చిత్రం ‘అర్జున్ రెడ్డి’. విజయ్ ముందు చిత్రం ‘పెళ్లి చూపులు’ భారీ హిట్ గా నిలవడంతో కాస్త క్రేజ్ గైన్ చేసుకున్న ఈ చిత్రం ఈ మధ్యే విడుదలైన టీజర్ తో మంచి అంచనాలను, ఆసక్తిని కూడా కూడగట్టుకుంది. టీజర్లో విజయ్ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా, అగ్రెసివ్ గా ఉండటంతో ప్రేక్షకులకు బాగా కనెక్టైపోయింది. ఎంతలా అంటే ఇతర హీరోల అభిమానులు సైతం ఆ పాత్రలో తమ అభిమాన హీరోలు ఎలా ఉంటారో ఊహించుకుని సరికొత్త వీడియోలను రూపొందించి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు.

సూర్య, ధనుష్, మహేష్ బాబు ల అభిమానులు అర్జున్ రెడ్డి టీజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్, కొన్ని విజువల్స్ ను తీసుకుని తమ హీరోల పాత చిత్రాల్లోని సన్నివేశాలకు యాడ్ చేసి వీడియోలను రూపొందించి సంబరపడుతున్నారు. కొందరు యువకులైతే స్వయంగా నటించేస్తున్నారు కూడా. యూట్యూబ్ లో అర్జున్ రెడ్డి టీజర్ అని సెర్చ్ చేస్తే ఒరిజినల్ తో పాటే వేల వ్యూస్ దక్కించుకున్న ఈ ఇమిటేషన్ టీజర్లు కూడా దర్శనమిస్తున్నాయి. అంతలా ఈ టీజర్ కు అడిక్టైపోయారు ప్రేక్షకులు. నూతన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఈ వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.