ఇంటర్వ్యూ : నాగ చైతన్య – నా పాత్రతో పాటే ప్రేక్షకుడు కూడా ప్రయాణిస్తాడు !
Published on Nov 8, 2016 1:43 pm IST

naga-chaitanya
ఇటీవల ‘ప్రేమమ్’ చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్న అక్కినేని హీరో నాగ చైతన్య మరొక చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. 2015 డిసెంబర్ లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కొన్ని అనుకోని కారణాల వలన ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్బంగా నాగ చైతన్యతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం…

ప్ర) చెప్పండి సినిమా ఎందుకింత ఆలస్యమైంది ?

జ) ఈ సినిమా 2015 డిసెంబర్ లో రిలీజ్ కావాల్సింది. కానీ తెలుగు, తమిళం రెండు భాషల్లో చేసేటప్పడికి అక్కడ డబ్బింగ్ లాంటి విషయాల్లో కొంత ఆలస్యం జరిగి ఇప్పడికి రిలీజ్ అవుతోంది. ‘ప్రేమమ్’ కంటే ముందే ఇది రిలీజ్ అవ్వాల్సింది.

ప్ర) రెండోసారి కూడా రెహమాన్ గారి సంగీతం పొందడం ఎలా ఉంది ?

జ) ఇది అనుకోకుండా జరిగింది. అయినా రెహమాన్ గారి లాంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ రెండవసారి కూడా నా సినిమా కోసం పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది ?

జ) సపరేట్ క్యారెక్టరైజేషన్ అంటూ ఏమీ ఉండదు. మామూలు కుర్రాళ్ళలాగే ఉంటుంది. చదువు పూర్తై ఉద్యోగం వెతుక్కునే కుర్రాడిగా, చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తాను. ఆ పాత్ర ప్రయాణం చేసే విధానం కొత్తగా ఉంటుంది. నా పాత్రతో పాటే చూసే ప్రేక్షకుడు కూడా ప్రయాణం చేస్తాడు. నా పాత్రను గౌతమ్ మీనన్ అలా డిజైన్ చేశారు.

ప్ర) తమిళంలో వేరే హీరో చేసే బదులు అక్కడ కూడా మీరే చెయ్యొచ్చుగా ?

జ) నేను కూడా ముందు అదే అనుకున్నాను. డైరెక్టర్ తో చెబితే ఇప్పటికే 20 రోజులకు పైగానే షూటింగ్ అయింది అన్నారు. అందుకే తెలుగుతో సరిపెట్టాను.

ప్ర) మరి తమిళ హీరోలు ఇక్కడ సినిమాలు చేస్తున్నారు. మీరు అక్కడ చేయరా ?

జ) అవును నిజమే. తమిళ హీరోలంతా తెలుగులో డైరెక్ట్ సినిమాలు కూడా చేస్తున్నారు. నేను కూడా త్వరలోనే ఒక ద్విభాషా చిత్రంలో నటించాలనుకుంటున్నాను. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా చేస్తాను.

ప్ర) ఈ సినిమా కథ ఏమిటి ? ఎలా ఉంటుంది ?

జ) ఈ సినిమాలో ఓ మామూలు కుర్రాడు ఒక అమ్మాయిని జర్నీలో ప్రేమిస్తాడు. కానీ రాత్రికి రాత్రి ఆ జంటకి ఆపద సంభవిస్తుంది. ఆ ప్రమాదం నుండి ఆ జంట ఎలా బయటపడ్డారు అన్నదే ఈ సినిమా. ఇందులో మొదటి పార్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీలా ఉంటుంది. సెకండ్ పార్ట్ యాక్షన్ థ్రిల్లర్ లా ఉంటుంది.

ప్ర) ఫ్యూచర్ లో ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు ?

జ) పర్టిక్యులర్ గా ఇలాంటి సినిమాలే చేయాలి అనేం లేదు. ప్రేక్షకులకి నచ్చే సినిమా ఏదైనా సరే చేస్తాను. కానీ సినిమా సినిమాకి మధ్య వేరియేషన్ ఉండేలా మాత్రం ఖచ్చితంగా చూసుకుంటాను.

ప్ర) కొత్త దర్శకులు ఎలాంటి కథలతో వస్తే మీరిష్టపడతారు ?

జ) కొత్త దర్శకులు నన్ను కన్విన్స్ చేయగలిగే కథ చెబితే చాలు నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. కథలో కాస్త కొత్తదనం, ప్రేక్షకులకు నచ్చేలా ఉండాలి.

ప్ర) మరి హీరోయిన్ ఎలా చేసింది ?

జ) హీరోయిన్ మంజిమ మోహన్ చాలా బాగా చేసింది. మంచి నటి. ఆమెతో కలిసి పనిచేయడం చాలా కంఫర్ట్ గా అనిపించింది.

ప్ర) మీరు ముందు చేసిన మాస్ సబ్జెక్ట్ సినిమాలు ఎందుకు అంత విజయం సాధించలేదు ?

జ) ఎందుకంటే ఆ వయసులో నాకు అలాంటి మాస్ సబ్జెక్ట్స్ ని క్యారీ చేసే మెచ్యూరిటీ లేకపోవడమో, స్క్రిప్ట్ ఎంచుకోవడంలో అంత అనుభవం లేకపోవడం వల్లనో ఆ సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు.

ప్ర) ఇక మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి ? ఇకపై మాస్ సినిమాలు చేస్తారా ?

జ) నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కళ్యాణ్ కృష్ణతోనే. మా సినిమా రేపటి నుండి షూటింగ్ మొదలవుతుంది. (నవ్వుతూ) ఈ ‘సాహసం శ్వాసగా సాగిపో’ తరువాత నేను మాస్, యాక్షన్ సబ్జెక్ట్స్ చేస్తే జనాలు చూస్తారనే అనుకుంటున్నాను.

 
Like us on Facebook