‘బాహుబలి 2’ కొత్త రిలీజ్ డేట్!

5th, August 2016 - 11:25:07 AM

baahubali
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’, ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చనడంలో సందేహం లేదన్న విషయం తెలిసిందే. గతేడాది జూలై నెలలో విడుదలై ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాకు రెండో భాగమైన ‘బాహుబలి ది కంక్లూజన్’ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఇక ఈ సినిమాను మొదట ఏప్రిల్ 17, 2017న విడుదల చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించిన టీమ్, తాజాగా ఏప్రిల్ 28వ తేదీకి సినిమా విడుదలను మార్చేసింది.

తెలుగు, తమిళం, మళయాలం, హిందీ.. ఇలా అన్ని భాషల్లోనూ భారీ రిలీజ్ కోసమే ఇలా విడుదల తేదీని మార్చినట్లు సమాచారం. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ రెండో భాగంలో ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడూ?’ అన్న ప్రశ్నకు సమాధానం కోసం సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొద్దిరోజులుగా రాజమౌళి అండ్ టీమ్ రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ పోర్షన్‌కు సంబంధించిన యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది.