‘బాహుబలి – 2’ ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ !


దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి2’ కోసం భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో వేరే చెప్పనక్కర్లేదు. ‘బాహుబలి’ మొదటి భాగం భారీ విజయం సాధించడం, తెలుసుకోవలసిన కథ మొత్తం రెండవ భాగంలోనే ఉండటంతో ఈ చిత్రంపై భారీ స్థాయి క్రేజ్ నెలకొని ఉంది. అందుకే ఈ సినిమాకు సంబందించిన టీజర్,ఆడియోల గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ మార్చి 16న రిలీజవుతుందట.

అలాగే 16వ తేదీ ఉదయం 9 నుండి 10 గంటల మధ్యలో ఏపి, తెలంగాణాల్లోని థియేటర్లలో ట్రైలర్ ను ప్రదర్శించి సాయంత్రం 5 గంటలకు సోషల్ మీడియాలో విడుదల చేస్తారని తెలుస్తోంది. సుమారు రూ. 240 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సెకండ్ పార్ట్ రూ. 1000 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తారా స్థాయిలో జరిగింది.