భళా రాజమౌళి.. సాహో ‘బాహుబలి’ !


భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ‘బాహుబలి – ది కంక్లూజన్’ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజయింది. అందరి అంచనాలకు తగ్గట్టే ట్రైలర్ చాలా ఘనంగా ఉంది. చూసిన ప్రేక్షకులు ప్రతి ఒక్కరు ఊపిరి బిగబట్టి మరీ వీక్షిస్తున్నారు. ప్రభాస్ వాయిస్ ఓవర్ తో మొదలయ్యే ఈ ట్రైలర్ లో సినిమాలోని కీలకమైన సన్నివేశాల్లో వచ్చే కొన్ని మాటల్ని, విజువల్స్ ని చూపెట్టాడు రాజమౌళి. ముఖ్యంగా కట్టప్ప బాహుబలిని చంపడానికి ముందు, కత్తితో పొడిచిన తర్వాతి దృశ్యాలను మెరుపు వేగంతో చూపించి అప్పటి వరకు ఉన్న ఉత్సుకతను ఇంకాస్త ఎక్కువ చేశాడు జక్కన్న.

ప్రభాస్, రానా ల మధ్య జరిగే పోరాట దృశ్యాలైతే శిఖర స్థాయిలో ఉన్నాయని చెప్పొచ్చు. భారీ శరీర సౌష్టవంతో ప్రభాస్, రానాలు వీరోచితంగా తలపడుతుంటే కనురెప్ప వేయడానిక్కూడా కష్టంగానే ఉంది. మొదటి భాగంలోనే యుద్ధ సన్నివేశాలతో రోమాలు లేచి నిలబడేలా చేసిన రాజమౌళి ఈ రెండవ భాగంలో యాక్షన్, ఎమోషన్ మోతాదును ఇంకా పెంచాడని ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థమైపోతోంది. అలాగే ట్రైలర్ చూస్తే శివగామిదేవి, కట్టప్ప పాత్రల వెనకున్న మర్మమేమిటో అనే ఆసక్తి కూడా తారా స్థాయికి చేరుతోంది.

ఇక ట్రైలర్లో అమితంగా ఆకట్టుకుంటున్న మరో అంశం అనుష్క. సాధారణంగా కాస్త బొద్దుగా ఉన్న అనుష్కను రాజమౌళి తన మాయాజాలంతో చాలా నాజూగ్గా, అందంగా చూపించాడు. ప్రభాస్, అనుష్కల మధ్య రొమాన్స్ తెర మీద రసవత్తరంగా పండినట్టు సులభంగానే తెలిసిపోతోంది. చివరగా పెద్దన్న కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ట్రైలర్ స్థాయిని రెట్టింపు చేసింది. యుద్ధ సన్నివేశాలు, ఇతర ముఖ్య సన్నివేశాల్లో ఆయన పనితనం గొప్పగా ఉంది. ట్రైలర్ లోని విఎఫ్ఎక్స్ వర్క్ చూస్తుంటే విజువల్ గా మొదటి భాగం కంటే ఈ భాగం కొన్ని రెట్లు ఎక్కువ ఘనంగా ఉండేలా ఉంది. మొత్తం మీద ట్రైలర్ చూసిన వారంతా భళా రాజమౌళి.. సాహో ‘బాహుబలి’ అంటున్నారు.