ఆ రెండు రాష్ట్రాల్లో కలిపి 1000 థియేటర్లలో రిలీజ్ కానున్న ‘బాహుబలి 2’ !


‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రం పట్ల దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి అన్ని భాషల పరిశ్రమలు రెడ్ కార్పెట్ పరిచుంచాయి. ఎన్నడూ, ఏ తెలుగు సినిమాకి లేని విధంగా రికార్డ్ స్థాయి థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయనున్నారు. ముఖ్యంగా తమిళనాడులో ఈ చిత్రానికి సుమారు 700 థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

అదే విధంగా కేరళలో 300 థియేటర్లను ఈ సినిమా కోసం కేటాయించారు. అంతేగాక ఈ చిత్రం యొక్క బాక్సాఫీస్ సత్తాను ముందుగానే ఊహించి తెలుగు, తమిళ, హిందీ లలో స్టార్ హీరోలెవరు 28న తమ సినిమాల్ని రిలీజ్ చేయడంలేదు. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా విడుదల కార్యక్రమాలు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ అత్యంత భారీ వ్యయంతో నిర్మించింది.