సాటిలైట్ రైట్స్ : ‘బాహుబలి 2’ రేంజ్ ఇదీ..!!
Published on Oct 17, 2016 2:58 pm IST

baahubali-2
గతేడాది జూలై నెలలో విడుదలైన ‘బాహుబలి’, ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఒక ప్రాంతీయ సినిమా ఊహకు కూడా అందని వసూళ్ళు రాబట్టిన ఈ సినిమా, తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఇక ఇప్పుడు తాజాగా బాహుబలికి రెండో భాగమైన బాహుబలి 2 సెట్స్‌పై ఉంది. దర్శకధీరుడు రాజమౌళి మొదటి భాగానికి ఎన్నో రెట్లు మించేలా రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కానున్న ‘బాహుబలి 2’, ఇప్పట్నుంచే ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

ప్రమోషన్స్ విషయంలో కొత్త పంథాను ఎంచుకోవడం, అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతూ ఉండడం.. ఇలా చాలా కారణాలతో బాహుబలి 2 వార్తల్లో నిలుస్తోంది. తాజాగా బాహుబలి 2 హిందీ వర్షన్ సాటిలైట్ రైట్స్‌కు సంబంధించిన వార్త సంచలనం రేపుతోంది. ప్రముఖ టీవీ నెట్‌వర్క్ సోనీ టీవీ ఈ సినిమా సాటిలైట్ హక్కులను సుమారు 51 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట. ఒక తెలుగు సినిమా, బాలీవుడ్‌లో ఈ స్థాయి బిజినెస్ చేస్తూ ఉండడాన్ని అతిపెద్ద విశేషంగానే చెప్పుకోవాలి. ఇక మరో నెలరోజుల్లో అన్ని భాషలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్, సాటిలైట్ బిజినెస్ పూర్తవుతుందట. వీటన్నింటిని బట్టి చూస్తే వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మరో పెద్ద బాక్సాఫీస్ ప్రభంజనానికి రంగం సిద్ధమైందనే చెప్పాలి.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook