‘బాహుబలి 2’ క్లైమాక్స్ పూర్తైంది!

baahubali
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’, ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చనడంలో సందేహం లేదన్న విషయం తెలిసిందే. గతేడాది జూలై నెలలో విడుదలై ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాకు రెండో భాగమైన ‘బాహుబలి ది కంక్లూజన్’ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఇక కొద్దినెలలుగా హైద్రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్‌కు సంబంధించిన షూటింగ్ జరుపుకుంటూ వచ్చిన టీమ్, నేటితో క్లైమాక్స్‌ను పక్కా ప్లాన్ ప్రకారంగా పూర్తి చేసింది.

ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌లో వచ్చే యుద్ధ సన్నివేశాలు ఇండియన్ సినీ అభిమానులకు ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌లా నిలుస్తాయని ‘బాహుబలి’ టీమ్ చెబుతూ వస్తోంది. కొద్దికాలంగా షూటింగ్‌తో బిజీగా గడిపిన టీమ్‌కు క్లైమాక్స్ కొద్దిరోజుల పాటు విశ్రాంతి దొరికిందని నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ తెలిపారు. మళ్ళీ సెప్టెంబర్ 6న కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నెలాఖర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.