
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చారిత్రక చిత్రం.. ‘బాహుబలి’. ఈ సినిమా మే 15న విడుదలవుతుందన్న విషయాన్ని రాజమౌళి ఇంతకుముందే తెలియజేశారు. సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను ఏప్రిల్ రెండో వారంలో నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ సెలవులు కూడా లేకుండా కష్టపడుతోంది. ఇక తాజాగా ఉగాది రోజున బాహుబలి ట్రైలర్ విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది.
బాహుబలి టీమ్ తమ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఒక ఫోటో ఉగాదిన ట్రైలర్ విడుదలవ్వనుందనే ప్రచారానికి బలం చేకూరుస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. “ఇకపై రెండు నెలల వరకూ బాహుబలి టీమ్‌కు వీకెండ్ సెలవులు, హాలీడేలు లేవు. ఇది వర్క్ టైమ్” అంటూ ఒక ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. బాహుబలి విజువల్ ఎఫెక్ట్స్ పనులు చూసుకుంటున్న హాలీవుడ్ టెక్నీషియన్ అదెల్‌ను ఈ ఫోటోలో చూడొచ్చు. అతని వెనుకాల ఉన్న షెడ్యూల్ ప్రకారం ట్రైలర్ షెడ్యూల్ మార్చి 20 వరకు ఉంది. అంటే 20వ తేదీ కల్లా ట్రైలర్ పనులు పూర్తి చేయడం కోసం ఆ షెడ్యూల్ ప్లాన్ చేశారని అభిమానులు చెప్పుకుంటున్నారు. అయితే అది ఈ రోజు వరకూ పూర్తైన షెడ్యూల్‌గా కూడా కొందరు చెబుతున్నారు. మరి ఎవరి వాదనలో నిజముంది? ట్రైలర్ రిలీజ్ ఎప్పుడూ ? అన్నది బాహుబలి టీమే తెలియజేయాలి.