భారీ రేటు పలికిన ‘బాహుబలి -2’ తమిళనాడు థియేట్రికల్ రైట్స్ !

3rd, August 2016 - 12:27:25 PM

baahubali
జక్కన్న ‘రాజమౌళి’ సృష్టించిన ‘బాహుబలి – ది బిగినింగ్’ ప్రభంజనంతో దాని సీక్వెల్ ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, బాహుబలి, భల్లాలదేవ ల మధ్య ఏం జరిగింది అన్న ప్రశ్నలకు సమాధానంగా ఈ సీక్వెల్ తెరకెక్కుతోంది. మొదటి భాగం ఊహించని భారీ లాభాల్ని కొల్లగొట్టడంతో రెండవ పార్ట్ థియేట్రికల్ హక్కుల ధరలు ఆకాశానంటుతున్నాయి.

అయినా కూడా బయ్యర్లు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా కోట్లు వెచ్చించి బాహుబలి-2 ని కొంటున్నారు. తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం తమిళనాడు థియేట్రికల్ రైట్స్ రూ. 44 కోట్లు పలికాయట. కానీ అంత భారీ మొత్తాన్ని వెచ్చించినది ఎవరో ఇంకా తెలియలేదు. ప్రస్తుతం క్లైమాక్స్ లో జరిగే యుద్ధ సన్నివేశాల చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం కోసం ఆర్ట్ డైరెక్టర్ ‘సాబు సిరిల్’ సారథ్యంలో ప్రతిరోజూ 300 నుండి 500 ల మంది కళాకారులు పనిచేస్తున్నారు. 2017 ఏప్రిల్ నెలలో ఈ చిత్రం విడుదలకానుంది.