మరోసారి ‘బాహుబలి’ పై ఆసక్తికరమైన ట్వీట్లు వేసిన వర్మ !

25th, April 2017 - 03:27:59 PM


వర్మ అంటేనే విమర్శలు, వివాదాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా సామాజిక మాధ్యమం ట్విట్టర్లో అయితే ఈ స్టార్ డైరెక్టర్ ట్వీట్లకు చాలా ఫాలోయింగ్ ఉంది. ఒక్కోసారి ఒక్కో అంశాన్ని తీసుకుని సంచలనాత్మక ట్వీట్లు చేస్తుంటారు వర్మ. ప్రస్తుతం ఈయన దృష్టంతా రాజమౌళి ‘బాహుబలి-2’ చిత్రం మీదనే ఉంది. నిన్న కూడా రాజమౌళిని ఉద్దేశించి సరదా ట్వీట్లు వేసిన వర్మ ఈరోజు దేశంలో ఉన్న దర్శకులందరినీ ఉద్దేశించి కాస్త ఘాటైన కామెంట్స్ చేశారు.

అదేమిటంటే ‘రాజమౌళి తీసిన బాహుబలి2 చిత్రాన్ని చూసిన తర్వాత దేశంలో మిగిలిన దర్శకులంతా తాము ఇంకా చాలా నేర్చుకోవాల్సిన టీవీ సీరియళ్ల దర్శకులమని అనుకుంటారని నా గట్టి నమ్మకం’ అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ట్విట్టర్లో ఒక హాట్ టాపిక్ గా మారింది. సినీ ప్రేక్షకులంతా ఈ వ్యాఖ్యలకి గాను వర్మకి ఎలాంటి జవాబులు, విమర్శలు, సవాళ్లు అందుతాయో చూడాలని ఆసక్తిగా ఉన్నారు.