టీజర్ : సమరానికి సిద్ధమంటోన్న బాలయ్య!
Published on Oct 11, 2016 11:16 am IST

gpsk
నందమూరి నటసింహం బాలయ్య హీరోగా నటిస్తోన్న వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళకముందు నుంచే బిజినెస్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2017న సినిమా విడుదలవుతుందని ముందే ప్రకటించిన టీమ్, అనుకున్న తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తోంది.

ఇక నేడు దసరా పండుగ సందర్భంగా అభిమానులను ఉత్సాహపరచేందుకు గౌతమిపుత్ర శాతకర్ణి టీమ్ ఫస్ట్ టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ చూస్తే బాలయ్య వందో సినిమా స్థాయికి తగ్గట్టే ఉందని అనిపిస్తోంది. ముఖ్యంగా టీజర్‌లోని డైలాగ్స్ పవర్‍ఫుల్‌గా ఉన్నాయి. ‘మా కత్తికంటిన నెత్తుటి చార, ఇంకా పచ్చిగానే వుంది. సమయం లేదు మిత్రమా, శరణమా? రణమా?’ అంటూ వచ్చే ఓ డైలాగ్ బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి ఇంటెన్సిటీ స్థాయిని బయటపెట్టింది. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఖైదీ నెం. 150తో కలిసి బాలయ్య వందో సినిమా బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుండడం ఆసక్తికర అంశంగా చెప్పుకోవాలి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 
Like us on Facebook