ఎన్టీఆర్ జీవితంపై సినిమా తీస్తానన్న బాలకృష్ణ !

6th, February 2017 - 03:39:17 PM


తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి తారకరామారావుగారి జీవితం ఎన్నో వైవిధ్యాలను, విశేషాలను నింపుకుని ఇప్పటికీ అందరికీ ఆశ్చర్యాన్ని, ఆసక్తినీ కలిగిస్తూనే ఉంటుంది. అలాంటి ఆయన జీవితాన్ని సినిమాగా తీయాలని ఎందరో మహా మహులైన దర్శకులు, నిర్మాతలు పలుసార్లు సంకల్పించారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఆయన తనయుడు బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ జీవితంపై సినిమా తీయనున్నట్లు బహిరంగ ప్రకటన చేశారు.

ఈరోజు బాలకృష్ణ కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో రాజకీయపరమైన పర్యటన నిర్వహించి బహిరంగ సభలో మాట్లాడుతూ నిమ్మకూరుతో ,అక్కడి ప్రజలతో ఎన్టీఆర్ కు ఉన్న అనుబంధాన్ని, రాజకీయపరంగా ఎన్టీఆర్ చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ఇంకా ఎన్నో విశేషాలను సేకరించాల్సి ఉంది, ఎందుకంటే రామారావుగారి జీవితంపై నేను సినిమా తీస్తున్నాను అని ప్రకటించారు. ఈ వార్త పట్ల నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సినిమా ఎప్పుడు, ఎలా మొదలుపెడతారనే వివరాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.