బాలకృష్ణ, పూరి జగన్నాథ్ లు కలిస్తే ఇలాగే ఉంటుంది !


నందమూరి బాలకృష్ణ.. ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉంటూ చకా చకా సీన్లు చేస్తూ దర్శకులను సైతం పరుగులు పెట్టించే హీరో, ఇక పూరి జగన్నాథ్.. ఒకసారి సినిమాను మొదలుపెట్టాక అనుకున్న సమయానికన్నా ముందే పూర్తి చేయగల సమర్థుడు. ఇలా అద్భుతమైన క్వాలిటీస్ ఉన్న ఈ ఇద్దరు వ్యక్తులు ఒకే సినిమాకి కలిసి పని చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. మార్చి 9న సినిమాను మొదలుపెట్టి, ఆ తర్వాత వారంలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసిన ఈ ఇద్దరు అప్పుడే ఒక షెడ్యూల్ ను ముగించేశారు.

ఆ షెడ్యూల్ ఏదో డ్రామా సన్నివేశమైతే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. కానీ వాళ్ళు చేసింది సినిమాకే హైలెట్ గా నిలవనున్న ఒక హెవీ యాక్షన్ సీక్వెన్స్. ఇలా ఒక భారీ పోరాట సన్నివేశాన్ని ఇంత త్వరగా ముగించేయడం వాళ్ళ సమర్థతను తెలియజేస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ నందమూరి అభిమానులకు కనులవిందుగా ఉంటుందని పూరి భరోసా కూడా ఇస్తున్నారు. టీజర్, ట్రైలర్ కట్ కోసం ముందుగా ఈ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారు. స్టార్ట్ చేసిన తేదీ మర్చిపోయేలోపు షెడ్యూల్ ను ఇలా ముగించేయడం చూస్తుంటే సినిమా ఎంత పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతుందో ఇట్టే అర్థమవుతోంది. ఇకపోతే మరో కొత్త షెడ్యూల్ ను ఏప్రిల్ 5నుండి హైదరాబాద్లో స్టార్ట్ చేయనున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న రిలీజ్ చేయనున్నారు.