అఖండ దెబ్బకి అమెరికాలో స్పీకర్లు బద్దలయ్యాయి – బాలకృష్ణ

Published on Mar 13, 2022 3:00 am IST


నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం “అఖండ” 100 రోజుల వేడుక కర్నూలులో ఘనంగా జరిగింది. కర్నూలు జిల్లాలోని 3 థియేటర్లలో ఈ చిత్రం 100 రోజులు విజయవంతంగా ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, కథానాయిక ప్రగ్యా జైశ్వాల్‌, నటులు శ్రీకాంత్‌తో పాటు చిత్ర బృందం హాజరైంది.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ అఖండమైన విజయం అందించిన ప్రేక్షక దేవుళ్లందరికీ కృతజ్ఞతలు తెలియచేశాడు. హైందవ సంస్కృతిని, తెలుగు సంప్రదాయాన్ని ఇనుముడింపి చేసిన చిత్రం అఖండ అని అన్నారు. ప్రకృతి, ఆడవాళ్లు, పసిపిల్లలకు అన్యాయం జరిగినప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి రక్షిస్తాడన్న భగవత్‌ సందేశాన్ని ఈ చిత్రంలో చూపించామన్నారు. ఇలాంటి సందేశాత్మక చిత్రాన్ని మా ద్వారా అందించే అవకాశం కల్పించిన ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపాడు.

అఖండ చిత్రం యావత్‌ భారతదేశం తలెత్తుకునేలా చేసిందని అన్నారు. బోయపాటి శ్రీను, మేము.. డబ్బును దృష్టిలో పెట్టుకుని సినిమా తీయమని, కట్టె.. కొట్టె.. తెచ్చె అనే మూడు మాటలతోనే సినిమా తీస్తామని అన్నారు. ముత్యాలు ఏటవాలుగా దొర్లితే చూడటానికి ఎంత అందంగా ఉంటాయో.. నటీనటుల నుంచి అలాంటి హావభావాలు రాబట్టగల దర్శకుడు బోయపాటి అని, సాధారణ సినిమా అఖండమైన విజయం సాధించడం గొప్ప విషయమని, సందేశాత్మ చిత్రాలను ప్రోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు చెప్పేందుకే ఇక్కడకు వచ్చామని బాలకృష్ణ అన్నారు.

కర్నూలు జిల్లాలోని 3 థియేటర్లలో, గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఒక థియేటర్‌లో ‘అఖండ’ చిత్రం 100 రోజుల ప్రదర్శించడం ఆనందంగా ఉందని అన్నారు. ‘చరిత్ర సృష్టించాలన్నా మేమే.. చరిత్ర తిరగరాయాలన్నా మేమే. మాకు మేమే పోటీ. సింహాకు పోటీ లెజెండ్‌, లెజెండ్‌కు పోటీ అఖండ.. నటనంటే కేవలం నవ్వించడమే కాదు.. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడమని అన్నారు.

కరోనా ఉన్న సమయంలోనే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమా షూటింగ్ చేశామని, షూటింగ్‌లో బిజీగా ఉండి కరోనా ఉందన్న విషయం కూడా మర్చిపోయామని అన్నారు. అఖండ సినిమా విడుదలైతే అమెరికాలోని థియేటర్లలో స్పీకర్లు కూడా బద్దలయ్యాయని.. అలాంటి సునామీ ఈ సినిమా సృష్టించిందని అన్నారు. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక దిక్సూచిలా నిలిచిందని, అఖండ చిత్రంలో పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లు, చిత్ర బృందానికి అభినందనలు తెలియచేశాడు.

సంబంధిత సమాచారం :