టార్గెట్ చేరుకునేందుకు వేగం పెంచిన బాలయ్య !


నందమూరి బాలకృష్ణ తన 101వ సినిమాను స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. మునుపెన్నడూ ప్రేక్షకులు ఊహించని క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై భారీ స్థాయి అంచనాలున్నాయి. మార్చి 9న రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసిన పూరి – బాలకృష్ణలు కొద్ది రోజుల్లోనే దాన్ని పూర్తి చేసి కాస్త గ్యాప్ తర్వాత ఏప్రిల్ 5న రెండవ షెడ్యూల్ ను ప్రారంభించారు.

ఈ షెడ్యూల్ కూడా శరవేగంగానే జరుగుతోంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ షూటింగ్ నగరంలోని సారధి స్టూడియోస్ లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. అక్కడ కథానాయకుడు బాలకృష్ణపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముందుగా ప్రకటించిన విడుదల తేదీ సెప్టెంబర్ 29 నాటికి చిత్రాన్ని రిలీజ్ చేయాలంటే ఆగష్టు నాటికి చిత్రీకరణ పూర్తై, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టాలి. అందుకే బాలక్రిష్ణ కూడా ఎక్కువ శాతం టైమ్ సినిమాకు కేటాయిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.