ఆ సినిమా చేసి కొంతైనా రుణం తీర్చుకుంటానంటున్న బాలయ్య !


నందమూరి అభిమానులకు ఇది శుభవార్తే. ఆ మధ్యన తాను నాన్నగారి బయోపిక్ లో నటిస్తున్నానని ప్రకటించిన బాలకృష్ణ అభిమానుల్లో హుషారు పెంచారు. ఆ తరువాత మళ్లీ ఆచిత్రం గురించిన వార్త ఏదీ బయటకు రాలేదు. దీనితో ఈ చిత్రం ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ బయోపిక్ పై బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు.ఈ చిత్రాన్ని ఖచ్చితంగా చేసి తీరుతానని బాలయ్య తెలిపాడు.

ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి కథని అద్భుత చిత్రంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నట్లు బాలయ్య వివరించాడు. దానికి సంబందించిన పనులు జరుగుతున్నాయని అన్నాడు. పైసా వసూల్ చిత్ర షూటింగ్ పూర్తయ్యాక ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ వర్క్ కోసం అనేక మంది కలవబోతున్నట్లు తెలిపాడు. ఎన్టీఆర్ గురించి చాలా మందికి తెలియని విషయాలని ఈ చిత్రం ద్వారా చూపించాలని ప్రయత్నిస్తున్నట్లు బాలకృష్ణ తెలపడం విశేషం. దీనికోసం ఎన్టీఆర్ వద్ద ఓఎస్డీ గా పనిచేసిన ఐఏఎస్ లక్ష్మి నారాయణ ని,మరికొందరి ఐఏఎస్ అధికారులను కలవబోతున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు. నాన్న గారి గొప్పతనాన్ని ప్రతిభింబించే స్క్రిప్ట్ పక్కాగా రెడీ కాగానే ఈ చిత్ర షూటింగ్ ని ప్రారంభించనున్నట్లు బాలకృష్ణ తెలిపాడు. నాన్నగారి చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేసి కొడుకుగా కొంత వరకైనా రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నట్లు బాలయ్య తెలిపాడు.