నారా రోహిత్‌ను అభినందించిన బాలయ్య!

balayya-nara-rohit
నారా రోహిత్, నాగ శౌర్య హీరోలుగా నటించగా, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన ‘జ్యో అచ్యుతానంద’ అనే సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ దిశగా దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా, ఇటు అభిమానులు, ప్రేక్షకులనే కాక సినీ ప్రముఖులను సైతం బాగా ఆకట్టుకుంటుంది. రాజమౌళి, సమంత, బాలకృష్ణ లాంటి టాప్ స్టార్స్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక నందమూరి బాలకృష్ణ సినిమాను మెచ్చుకోవడమే కాక, తన కుటుంబానికి చెందిన హీరో అయిన నారా రోహిత్‌పై ప్రశంసలు కురిపించారు. నారా రోహిత్ నటన చాలా బాగా నచ్చిందని, జ్యో అచ్యుతానంద సక్సెస్ కావడం పట్ల సంతోషంగా ఉన్నానని తెలుపుతూ నారా రోహిత్ ఇలాంటి మరెన్నో మంచి సినిమాలు చేయాలని బాలయ్య కోరుకున్నారు. సాయి కొర్రపాటి నిర్మాణంలో తెరకెక్కిన జ్యో అచ్యుతానంద సినిమాలో రెజీనా హీరోయిన్‌గా నటించారు.