క్రిష్ ప్లానింగ్‌కు ఫిదా అయిపోయిన బాలయ్య!

Gautamiputra
నందమూరి నటసింహం బాలయ్య హీరోగా నటిస్తోన్న వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని తారాస్థాయి అంచనాల మధ్యన జనవరి నెలలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇక షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో క్రిష్ నిమగ్నమైపోయారు. షూట్ ఔట్‌పుట్‌తో హ్యాపీగా ఉన్న ఆయన, విజువల్ ఎఫెక్ట్స్ పనులను పూర్తి చేస్తున్నారు.

ఇక షూటింగ్ పోర్షన్ మొత్తాన్నీ మొదట 80 రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేశారట. ప్రొడక్షన్‌ను తెలివిగా ప్లాన్ చేస్తారన్న పేరున్న క్రిష్, 79 రోజుల్లోనే షూట్ మొత్తం పూర్తి చేశారట. దీంతో ఇంత భారీ బడ్జెట్, చారిత్రక సినిమాను కూడా అనుకున్న టైమ్‌లో పూర్తి చేసిన క్రిష్ ప్రతిభకు బాలయ్య ఫిదా అయి మెచ్చుకున్నారట. ప్రమోషన్స్‌లో భాగంగా టీమ్ సభ్యులు మాట్లాడుతూ ఈ విషయం తెలియజేశారు. మొత్తం నాలుగు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక డిసెంబర్ 16న తిరుపతిలో జరగనుంది.