సాయి తేజ్ యాక్సిడెంట్.. నరేశ్‌పై సినీ ప్రముఖుల విమర్శలు..!

Published on Sep 11, 2021 8:45 pm IST


మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సాయితేజ్‌కు రోడ్డు ప్రమాదం జరిగిన అనంతరం సీనియర్ నటుడు నరేశ్ చేసిన వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు సీరియస్ అవుతున్నారు.

నరేశ్ వ్యాఖ్యలపై నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ స్పందిస్తూ ఈ సమయంలో ఎవరెవరు ప్రమాదవశాత్తు మరణించారో నరేశ్ గారు చెప్పడం కరెక్ట్ కాదని, ఇప్పుడెందుకు రేసింగ్‌లు చేశాడు, మా ఇంటి దగ్గరకు వచ్చాడు.. ఇవ్వన్ని తప్పు అని, ఎప్పుడేమి మాట్లాడాలో అందరూ తెలుసుకోవాలని అన్నాడు. సాయి తేజ్ భగవంతుడి ఆశీస్సులతో చిన్న ప్రమాదం నుంచి బయటపడ్డాడు, త్వరగా కోలుకుని, యథావిధిగా షూటింగుల్లో పాల్గొంటారు, బ్రహ్మాండంగా ఉంటారని బండ్ల అన్నాడు.

ఇక హీరో శ్రీకాంత్ కూడా నరేశ్ వ్యాఖ్యలను తప్పుపట్టాడు. ఈ సమయంలో నరేశ్ గారు చనిపోయిన వారి గురుంచి మాట్లాడడం సరికాదని తనకు అనిపించిందని, ఇలాంటి సమయంలో ఇలాంటి కామెంట్లు ఎవరూ చేయకండని తాను కోరుతున్నానని అన్నాడు. సాయి తేజ్ చాలా మెచ్యూర్డ్ పర్సన్ అని ఆయన త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్టు శ్రీకాంత్ తెలిపాడు.

నిర్మాత నట్టి కుమార్ కూడా నరేశ్ వ్యాఖ్యలను తప్పుపట్టాడు. సాయి తేజ్ త్వరగా కోలుకుని, మళ్ళీ సినిమాల్లో నటించాలని మనమంతా కోరుకుందామని అన్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు వద్దని, సాయి తేజ్ రేసింగ్ చేస్తాడని నరేశ్ అనడం కరెక్ట్ కాదని అన్నాడు.

అసలు నరేశ్ సాయి తేజ్ యాక్సిడెంట్‌పై స్పందిస్తూ ఏమన్నాడంటే సాయి ధరమ్‌ తేజ్‌ నా బిడ్డలాంటివాడు అని, నా కుమారుడు నవీన్‌ విజయ కృష్ణ, సాయి తేజ్ మంచి స్నేహితులు అని నిన్న సాయంత్రం మా ఇంటి నుంచే ఇద్దరు వెళ్లారని, బైక్‌పై స్పీడ్‌గా వెళ్లొద్దని చెప్పాలనుకుని బయటకు వచ్చే సరికే వారు బైక్స్‌పై వెళ్ళిపోయారని అన్నాడు. గతంలో ఇద్దరు బైక్ రేసింగ్‌లకి వెళ్ళే వారని, నాలుగు రోజుల క్రితం కూడా ఈ విషయంలో వీళ్లిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇవ్వాలని అనుకున్నానని, కానీ కుదరలేదని అన్నారు. పెళ్లి, కెరీర్‌తో జీవితంలో సెటిల్‌ అవ్వాల్సిన సమయంలో ఇలాంటి రిస్కులు తీసుకోవద్దని, గతంలో చాలా మంది రేసింగ్‌లలో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటున్నట్లు నరేశ్ అన్నాడు.

సంబంధిత సమాచారం :