టీవీ ప్రీమియర్లకు సిద్దమైన ‘బహుబలి-2’ !

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తిచేసిన చిత్రం ‘బాహుబలి-2’. సుమారు రూ.1800 కోట్లకు పైగానే వసూళ్లను సాధించిన ఈ చిత్రం అన్ని బాలీవుడ్ సినిమాల్ని తలదన్ని ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను థియేటర్లో వీక్షించని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆదరణ దక్కించుకున్న ఈ సినిమా ఈరోజు టీవీల్లో ప్రదర్శితం కానుంది.

అది కూడా ఒకేరోజు మూడు భాషల్లో కావడం విశేషం. ముందుగా మధ్యాహ్నం ఒంటిగంటకు సోనీ మ్యాక్స్ లో హిందీ వెర్షన్, తర్వాత విజయ్ టెలివిజన్ లో 3 గంటలకు తమిళ వెర్షన్, చివరగా స్టార్ మాలో సాయంత్రం 5 గంటలకు మాతృక తెలుగు వెర్షన్ ప్రసారం కానున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి శాటిలైట్ హక్కుల్ని కొనుగోలుచేసిన ఈ మూడు టీవీ చానెళ్లు ఈరోజు ‘బాహుబలి-2’ ప్రదర్శనతో టిఆర్ఫీ రేటింగ్స్ భారీ స్థాయిలో ఉంటాయని ఆశిస్తున్నాయి. ఇకపోతే రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ఒకేరోజు మూడు భాషల్లో ప్రాసరం కానుంది. ఇంతకన్నా మంచి ఆదివారం మరొకటి ఉండదు అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.