ఇంటర్వ్యూ : పాత్రలో నటనకు స్కోప్ ఉంది కాబట్టే ఒప్పుకున్నాను – అర్జున్


ఒకప్పుడు స్టార్ నటుడిగా వెలుగొంది కాలానుగుణంగా మారుతూ ప్రస్తుతం మంచి పాత్రలు దొరికే నో చెప్పకుండా చేసేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న విలక్షణ నటుడు అర్జున్ తాజాగా నితిన్ – హను రాఘవపూడిల ‘లై’ సినిమాలో ప్రతి నాయకుడి పాత్ర చేశారు. సినిమాలో ఆయన నటనకుగాను మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సందర్బంగా ఆయన మీడియాతో తన అభిప్రాయాలల్ని పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) విలన్ గా ఎందుకు చేయాలనుకున్నారు ?
జ) 150 సినిమాల తర్వాత ఇంకా హీరోగానే చేయడమంటే కష్టాంగానే ఉంటుంది. డిఫరెంట్ గా ట్రై చేయాల్సిన సమయం ఇదే అని చేస్తున్నాను. సంవత్సరంలో హీరోగా, విలన్ గాను, ఇతర పాత్రలు అన్నీ చేయాలి. అప్పుడే బాగుంటుంది.

ప్ర) నితిన్ తో పనిచేయడం ఎలా ఉంది ?
జ) నితిన్ తో ‘శ్రీ ఆంజనేయం’ చేశాను. మంచి హార్డ్ వర్కర్. ఎప్పుడూ సరదాగా ఉంటాడు. సెట్స్ లో కూడా అతనుంటే బాగుంటుంది.

ప్ర) ఈ సినిమాకే ప్రమోషన్లు ఎందుకు చేస్తున్నారు ?
జ) అలా ఏం లేదు. పాత రోజుల్లో ఇంతలా మీడియా ఉండేది కాదు. ప్రమోషన్లు పెద్ద కష్టం. సపరేట్ కాల్ షీట్స్ ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడలా కాదు. జనాలకు చూడటానికి చాలా ఉన్నాయి. వాటిలో మన సినిమా ఎలా ఉంది జనాలకు తెలియాలంటే ప్రమోషన్లు చేయాల్సిందే.

ప్ర) ప్రస్తుతం మీరున్న దశ మీకు ఎలా అనిపిస్తోంది ?
జ) సినిమా మారిపోయింది. హాలీవుడ్లో ఇలాంటివి ఎప్పుడో మొదలయాయ్యి. మంచి పాత్ర వచ్చినప్పుడు అది హీరోనా, విలనా అనేది చూడరు. కానీ ఇక్కడ మనకు ఇమేజ్ అనేది అవసరం. కానీ నాకలా కాదు. నేను కూడా డైరెక్టర్, నిర్మాతని కనుక అవసరమైతే అన్నిటినీ బ్రేక్ చేసుకుంటాను.

ప్ర) ఎలాంటి సినిమాలు చేయాలనుంది ?
జ) పర్టిక్యులర్ గా ఇలాంటి సినిమాలే చేయాలనేం లేదు. మంచి కథలొస్తే ఎలాంటివైనా చేస్తాను.

ప్ర) ప్రస్తుతం పెద్ద హీరోలంతా పొలిటికల్ పార్టీలు పెడుతున్నారు. మీకు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ?
జ) మంచి రాజకీయనాయకుడిగా, చెడ్డ రాజకీయనాయకుడిగా ఉండటానికి చాలా తెలివి కావాలి. నాకు అలాంటి తెలివి లేదు. అది కొందరికి మాత్రమే ఉంటుంది. ఏదో సినిమాల్లో ఉన్నాం, జనం ఇష్టపడతారు అని వస్తే కుదరదు. అయినా మంచి పనులు చేయాలంటే రాజకీయనాయకుడే అవనవసరంలేదు. సినిమాల్లో ఉండి కూడా చేయొచ్చు. నేను అలాగే చేస్తున్నాను.

ప్ర) ఇందులో మీరు క్యారెక్టర్స్ చేంజ్ చేసేప్పుడు ఎంత టైమ్ పట్టింది ?
జ) ఒక పాత్ర నుండి ఇంకో పాత్రలోకి మారడానికి 2, 3 గంటల సమయం పడుతుంది. వేసుకున్న పాత్రను తీసేయడానికి అరగంట వరకు పడుతుంది.

ప్ర) కథ చెప్పగానే మీకు ఎలా అనిపించింది ?
జ) అంటే కథలో నా పాత్ర గురించి వినగానే అందులో నటించడానికి స్కోప్ ఉందని అనిపించింది. అందులో ఎలివేషన్ కూడా ఉంది. అందుకే చేయాలని నిర్ణయించుకున్నాను.

ప్ర) ప్రస్తుతం ఏ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు ?
జ) నా కుమార్తె ఐశ్వర్య ప్రధాన పాత్రలో ఒక సినిమా చేస్తున్నాను. షూటింగ్ కూడా అయిపోవచ్చింది. తమిళం, కన్నడలో చేస్తున్నాను.

ప్ర) మీ కుమార్తెని బాగా ప్రమోట్ చేసుకుంటున్నారా ?
జ) అది నా బాధ్యత. చేసుకోవాలి. నా కూతురిని సినిమాలోకి తీసుకొచ్చేప్పుడు చాల మంది ఎందుకు అన్నారు. 35 ఏళ్లుగా నేనున్న పరిశ్రమనే నేను నమ్మలేకపోతే ఎలా. ప్రతి దాంట్లో తప్పుంటుంది, ఒప్పుంటుంది. అది మన మీదే ఆధారపడి ఉంటుంది.

ప్ర) మీకు తెలుగు, తమిళంలో ఎక్కడ ఎక్కువ బాగుంది ?
జ) తెలుగు, తమిళం అనే తేడా ఏం లేదు. ఎక్కడ మంచి పాత్రలు, కథలు వస్తే చేస్తూవెళ్తాను. నాకు రెండూ బాగానే ఉంటాయి.

ప్ర) మీ దృష్టిలో దేశభక్తి అంటే ఏంటి ?
జ) దేశభక్తి అంటే సరిహద్దుల్లో కాపలా కాయడమొక్కటే కాదు దేశానికి ఉపయోగపడే మంచి పని ఏది చేసిన అది దేశభక్తే అవుతుంది. అన్నం లేని వాడికి అన్నం పెట్టడం, ఇంటిని, పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడం వంటివన్నీ దేశభక్తి కిందికే వస్తాయి.